తాడేపల్లి: ప్రభుత్వ కార్యాలయంలో గాడిదను కట్టేసి... స.హ కార్యకర్త వినూత్న నిరసన

Arun Kumar P   | Asianet News
Published : Sep 03, 2021, 01:34 PM IST
తాడేపల్లి: ప్రభుత్వ కార్యాలయంలో గాడిదను కట్టేసి... స.హ కార్యకర్త వినూత్న నిరసన

సారాంశం

ప్రభుత్వ అధికారుల నిర్లక్ష్యానికి నిరసనగా ప్రభుత్వ కార్యాలయంలో గాడిదను కట్టి నిరసనకు దిగాడు ఓ సమాచార హక్కు చట్టం కార్యకర్త. ఈ ఘటన తాడేపల్లి-మంగళగిరి నగరపాలకసంస్థ పరిధిలో జరిగింది. 

గుంటూరు: ప్రభుత్వ అధికారుల నిర్లక్ష్యం కారణంగా ప్రజలు ప్రమాదాలబారిన పడుతున్నారంటూ సమాచార హక్కు చట్టం కార్యకర్త వినూత్ననిరసన చేపట్టాడు. ఏ అధికారులయితే ప్రజల ఫిర్యాదులను పట్టించుకోవడం లేదో వారి కార్యాలయంలో ఓ గాడిదను కట్టేసి నిరసన తెలిపాడు. ఈ ఘటన మంగళగిరి-తాడేపల్లి నగరపాలక సంస్థ పరిదిలో చోటుచేసుకుంది. 

మంగళగిరి-తాడేపల్లి కార్పోరేషన్ పరిధిలోని యర్రబాలెం పురవీధుల్లో గత కొంతకాలంగా సంచరిస్తోన్న గాడిదల కారణంగా వాహనదారులు బెంబేలెత్తిపోతున్నారు. గాడిదలు రోడ్లపైకి వచ్చి ప్రమాదాలకు కారణమవుతున్నాయి. ప్రధానంగా రాత్రివేళల్లో వీధిలైట్లు సరిగా వెలగడం లేదు. ఇది చాలదన్నట్లు రాత్రి వేళల్లో గాడిదలు రోడ్డుపైనే మకాం వేస్తున్నాయి. దీంతో ఈ గాడిదలను గమనించని వాహనదారులు వాటిని ఢీ కొట్టి ప్రమాదాలకు గురవుతూ ప్రాణాలమీదకు తెచ్చుకుంటున్నారు. చాలా మంది ఇప్పటికే తీవ్ర గాయాలపాలయ్యారు. 

ఏడెనిమిది నెలల క్రితం గ్రామానికి చెందిన ఓ ద్విచక్ర వాహనదారుడు రోడ్డుపై వెళుతుండగా రోడ్డుపక్కనే సంచరిస్తోన్న ఓ గాడిద ఆకస్మాత్తుగా వచ్చి ఢీకొట్టడంతో అతడు ప్రమాదానికి గురయ్యాడు. ఈ ఘటనలో వాహనదారుడికి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో పంచాయతి అధికారులకు స్థానిక ప్రజలు ఈ గాడిదల సంచారం, వాటివల్ల జరుగుతున్న ప్రమాదాల గురించి  ఫిర్యాదు చేశారు. అయితే అధికారులు స్థానికుల ఫిర్యాదును పట్టించుకోక పోవడంతో స.హ. చట్టం కార్యకర్త ఎన్. నాగరాజు వినూత్న నిరసన చేపట్టాడు. 

వీడియో

శుక్రవారం  రోడ్డుపై సంచరిస్తోన్న గాడిదను పంచాయతి కార్యాలయంలోని ఈఓ ఛాంబర్ ఎదుట కట్టివేసి నాగరాజు నిరసన తెలిపారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు తమ నిర్లక్ష్యం వీడి గ్రామంలో గాడిదల సంచారాన్ని అరికట్టాలని కోరారు. అదే విధంగా గ్రామంలో యధేశ్చగా సంచరిస్తోన్న పందుల సంచారాన్ని కూడా అరికట్టాలని నాగరాజు సంబంధిత అధికారులను కోరారు.

PREV
click me!

Recommended Stories

Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?
IMD Cold Wave Alert : ఈ సీజన్లోనే కూలెస్ట్ మార్నింగ్స్ .. 14 జిల్లాల్లో ఆరెంజ్, 19 జిల్లాల్లో ఎల్లో అలర్ట్