నెల్లూరు టీడీపీలో అసంతృప్తి సెగ: వైసీపీ వైపు ఆ ముగ్గురు..

By Nagaraju penumalaFirst Published Feb 14, 2019, 12:07 PM IST
Highlights

నేతల అసంతృప్తిని క్యాష్ చేసుకునేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రంగంలోకి దిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి రావాలని ఆహ్వానించినట్లు కూడా తెలుస్తోంది. అధిష్టానం పునరాలోచించుకుంటుందని తాము భావిస్తున్నామని వేచి చూస్తామని వైసీపీ నేతలతో చెప్పినట్లు సమాచారం. 

నెల్లూరు: నెల్లూరు జిల్లా తెలుగుదేశం పార్టీలో రాజకీయాలు కాక పుట్టిస్తున్నాయి. నెల్లూరు జిల్లాకు సంబంధించి చంద్రబాబు నాయుడు టికెట్లు కేటాయింపు చేశారు. నెల్లూరు అర్బన్ నియోజకవర్గం నుంచి మంత్రి నారాయణ, రూరల్ నియోజకవర్గం నుంచి ఆదాల ప్రభాకర్ రెడ్డి, సర్వేపల్లి నియోజకవర్గం నుంచి వ్యవసాయ శాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పోటీ చేస్తారని ప్రకటించారు. 

చంద్రబాబు నాయుడు టికెట్లు కేటాయింపు నేపథ్యంలో తెలుగుదేశంలో ఒక్క సారిగా అసంతృప్తి జ్వాల చెలరేగింది. నెల్లూరు సిటీ, నెల్లూరు రూరల్ నియోజకవర్గాలలో ఏదో ఒక నియోజకవర్గం నుంచి పోటీచేసి ఈసారి అసెంబ్లీకి వెళ్లాలని మేయర్ అబ్దుల్ అజీజ్, టీడీపీ నేత ఆనం జయకుమార్ రెడ్డి, పెళ్లకూరు శ్రీనివాసుల రెడ్డి భావించారు. 

అయితే అనూహ్య పరిణామాల నేపథ్యంలో రెండు టికెట్లు చంద్రబాబు నాయుడు ప్రకటించడంతో వారు తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు. ఇప్పటికే మేయర్ అబ్దుల్ అజీజ్, ఆనం జయకుమార్ రెడ్డిలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

తన సోదరులు ఆనం రామనారాయణరెడ్డిని కాదని పార్టీలోనే కొనసాగుతున్నానని అయితే తనకు టికెట్ ఇవ్వకపోవడంపై ఆనం జయకుమార్ రెడ్డి ఆగ్రహంతో రగిలిపోతున్నారు. మరోవైపు నెల్లూరు రూరల్, లేదా సిటీ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తానని తాను గతంలోనే చంద్రబాబుకు చెప్పానని ఇప్పటికే చాలా డబ్బు ఖర్చు చేశానని ముఖ్యమంత్రి నిర్ణయం తనను కలచివేసిందని మేయర్ అబ్దుల్ అజీజ్ తన సన్నిహితుల వద్ద వాపోయారట. 

నేతల అసంతృప్తిని క్యాష్ చేసుకునేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రంగంలోకి దిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి రావాలని ఆహ్వానించినట్లు కూడా తెలుస్తోంది. అధిష్టానం పునరాలోచించుకుంటుందని తాము భావిస్తున్నామని వేచి చూస్తామని వైసీపీ నేతలతో చెప్పినట్లు సమాచారం. 

ఇకపోతే నెల్లూరు తెలుగుదేశం పార్టీలో అసంతృప్తి బయటకు రావడంతో టీడీపీ అధిష్టానం అప్రమత్తమైంది. అసంతృప్తులను అమరావతి రావాలని సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశించారు. దీంతో వారంతా చంద్రబాబును కలిసేందుకు అమరావతి చేరుకున్నారు. చంద్రబాబు నాయుడుతో చర్చించిన తర్వాత భవిష్యత్ కార్యచరణ ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.   
 

click me!