ఇళ్ల పట్టాల పంపిణీలో రసాభాస.. వేదికపైనే వైసీపీ నేతల మాటల యుద్ధం

By Siva KodatiFirst Published Dec 26, 2020, 9:07 PM IST
Highlights

ప్రకాశం జిల్లా చీరాల వైసీపీలో మరోసారి వర్గ విభేదాలు భగ్గుమన్నాయి. వేటపాలెం మండలం అక్కాయిపాలెంలో ఇళ్ల స్థలాల పంపిణీ రసాభాసగా మారింది. ఎమ్మెల్యే కరణం బలరాం సమక్షంలోనే పాలేటి రామారావు, ఎమ్మెల్సీ పోతుల సునీత మధ్య వాగ్వాదం జరిగింది

ప్రకాశం జిల్లా చీరాల వైసీపీలో మరోసారి వర్గ విభేదాలు భగ్గుమన్నాయి. వేటపాలెం మండలం అక్కాయిపాలెంలో ఇళ్ల స్థలాల పంపిణీ రసాభాసగా మారింది. ఎమ్మెల్యే కరణం బలరాం సమక్షంలోనే పాలేటి రామారావు, ఎమ్మెల్సీ పోతుల సునీత మధ్య వాగ్వాదం జరిగింది.

కరణం బలరాంను 2024లోనూ ఎమ్మెల్యేగా గెలిపించుకోవాలని పాలేటి రామారావు శ్రేణులకు పిలుపునిచ్చారు. ఆ వ్యాఖ్యలపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన పోతుల సునీత.. 2024 సంగతి ఇప్పుడెందుకని పాలేటి ప్రసంగాన్ని అడ్డుకున్నారు. ఎంతగా నచ్చజెప్పినా ఇరువురు నేతలు వెనక్కి తగ్గలేదు. చివరికి ఎమ్మెల్యే కరణం జోక్యంతో గొడవ సద్దుమణిగింది. 

కాగా, నిన్న పశ్చిమ గోదావరి జిల్లా పాలకోడేరు మండలం మోగల్లులో ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో రగడ నెలకొంది. ఇళ్ల పట్టాల పంపిణీ సక్రమంగా సాగడం లేదంటూ ఉండి టీడీపీ ఎమ్మెల్యే రామరాజు వేదికపై ప్రశ్నించారు.

దీంతో రామరాజుపై వైసీపీ కన్వీనర్ నరసింహారాజు వాగ్యుద్దానికి దిగారు. స్టేజ్‌ పైనే ఇద్దరు విమర్శలు చేసుకున్నారు. దీంతో టీడీపీ, వైసీపీ కార్యకర్తల మధ్య ఆందోళన నెలకొంది. దీంతో ఇరు వర్గాలకు సీనియర్ నేతలు, పోలీసులు సర్దిచెప్పారు.

కరోనా కారణంగా పలుమార్లు వాయిదా పడుతూ వస్తున్న ఇళ్ల పట్టాల పంపిణీ పథకాన్ని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రారంభించారు.

తూర్పు గోదావరి జిల్లా కొమరగిరిలో ఇళ్లు పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని సీఎం జగన్‌ శుక్రవారం లాంఛనంగా ప్రారంభించారు. రాష్ట్రంలోని 3 ప్రాంతాల్లో ఇళ్ల స్థలాల పంపిణీ కోసం వేర్వేరు తేదీలను ప్రభుత్వం నిర్ణయించింది.

click me!