
‘ప్రత్యేకహోదా’పై ఇంతకాలం కేంద్రం అబద్దాలు చెప్పిందా? కేంద్ర వైఖరి చూస్తుంటే నిజమే అనిపిస్తోంది. రాష్ట్రవిభజనలో నష్టపోయిన ఏపి అభివృద్ధికి ప్రత్యేకహోదా అన్నది చాలా కీలకం. రాష్ట్ర విభజన బిల్లు పాసయ్యేటప్పటి నుండి పోయిన ఎన్నికల వరకూ జరిగిన ప్రహసనమంతా అందరికీ తెలిసిందే. హోదానే తురుపుముక్కగా చేసుకుని టిడిపి, భాజపాలు ఎలా లబ్దిపొందాయో అందరూ చూసిందే. అయితే, అధికారంలోకి వచ్చిన తర్వాత హోదా అమలుపై కేంద్రమంత్రులతో పాటు చంద్రబాబునాయుడు ఎన్ని పిల్లిమొగ్గలు వేసారో అందరూ చూసారు.
ఇదంతా ఎందుకు జరిగిందంటే ఏపికి హోదా ఇవ్వటం ప్రధానమంత్రి నరేంద్రమోడికి ఏమాత్రం ఇష్టం లేదు. పైగా హోదా త్వరలో రద్దవుతోందని, 2017 తర్వాత దేశంలో ఏ రాష్ట్రానికీ ప్రత్యేకహోదా ఉండదంటూ కేంద్రమంత్రలు ఎన్నో ప్రకటనలు చేసారు. దాన్ని పట్టుకుని చంద్రబాబు కూడా హోదా కావాలని ఆందోళన చేస్తున్న ప్రతిపక్షాలపై ఉక్కుపాదం మోపారు. దాంతో కొంతకాలంగా హోదాపై ఎవరు మాట్లాడటం లేదన్నది వాస్తవం.
అయితే, ప్రత్యేకహోదాపై హటాత్తుగా కేంద్రం తన నిర్ణయాన్ని మార్చుకుందా? లేకపోతే ఇంతకాలం రాష్ట్రప్రజలను తప్పుదోవ పట్టించిందా అన్న అనుమానం వస్తోంది. ఎందుకంటే, కాశ్మీర్, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్ తో పాటు ఈశాన్య రాష్ట్రాలకు ప్రత్యేకహోదా రాయితీలను పదేళ్ళు పొడిగిస్తూ కేంద్రం తాజాగా నిర్ణయం తీసుకోవటం గమనార్హం. అంటే ప్రత్యేకహోదా కాలం చెల్లిన అంశమని కేంద్రం, చంద్రబాబు ఇంతకాలం చెబుతున్నదంతా అబద్దమని తేలిపోయింది.
పై రాష్ట్రాలకు ప్రత్యేకహోదాలో వచ్చే ఆర్ధిక ప్రయోజనాలను మరో పదేళ్ళ పాటు పొడిగించాలని నాలుగు రోజుల క్రితం కేంద్ర క్యాబినెట్ నిర్ణయించింది. అంటే క్యాబినెట్ తాజా నిర్ణయం ప్రకారం ఆర్ధిక ప్రయోజనాలు 2027 వరకూ కొనసాగుతుందన్న విషయం స్పష్టమైపోయింది. మరి, ఇంతకాలం రాష్ట్రప్రజలను కేంద్రం, చంద్రబాబు ఎందుకు మోసిం చేసారో అర్ధం కావటం లేదు.