
ఏపీ సీఎం , వైసీపీ అధినేత వైఎస్ జగన్ కాన్వాయ్‌ను రైతులు అడ్డుకోవడం సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ధర్మవరం వైసీపీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి స్పందించారు . సీఎం కాన్వాయ్‌ని రైతులు అడ్డుకోవడం వెనుక పక్కా ప్లానింగ్ వుందని ఆరోపించారు. తుంపర్తి, మోటమర్ల వద్ద భూసేకరణ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో జరిగిందన్నారు. అప్పుడు ఎకరానికి 5 లక్షలు పరిహారంగా నిర్ణయించి.. న్యాయస్థానంలో డిపాజిట్ చేసిన విషయాన్ని కేతిరెడ్డి గుర్తుచేశారు.
అయితే రైతులకు 20 లక్షల పరిహారం ఇవ్వాలని తాను గతంలో పోరాడానని వెంకట్రామిరెడ్డి తెలిపారు. వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులతో కలిసి తాము అధికారులను కూడా సంప్రదించామని ఎమ్మెల్యే వెల్లడించారు. అంతేకాకుండా ఒక్కసారి కోర్టులో పరిహారం డిపాజిట్ చేసిన తర్వాత దానిని పెంచడానికి కుదరదని.. ఎందుకంటే అది చట్టమని కేతిరెడ్డి పేర్కొన్నారు. ఈ పరిహారాన్ని పెంచింది తెలుగుదేశం పార్టీయేనని.. అప్పుడే దీనికి సంబంధించి రైతులకు చెప్పినట్లు వెంకట్రామిరెడ్డి తెలిపారు. కానీ ఇప్పుడు సీఎం జగన్ పర్యటనను అడ్డుకునేలా కొందరు రైతులను రెచ్చగొట్టి పంపారని.. దీని వెనుక ఎవరున్నారో అందరికీ తెలుసునని ఆయన అన్నారు.
కాగా.. బుధవారం జగనన్న వసతి దీవెన కార్యక్రమం కోసం ముఖ్యమంత్రి జగన్ అనంతపురం జిల్లా నార్పలకు వచ్చారు. ఈ క్రమంలో ఆయన తిరు ప్రయాణంలో వెళ్తుండగా.. ధర్మవరం మండలం పోతుల నాగేపల్లి వద్ద సీఎం కాన్వాయ్‌ని కొందరు రైతులు అడ్డుకున్నారు. తమకు పరిహారం ఇవ్వాలంటూ నినాదం చేశారు.