పెద్దిరెడ్డిపై నిమ్మగడ్డ ఆదేశాలు: డీజీపీ గౌతమ్ సవాంగ్ స్పందన ఇదీ...

By telugu teamFirst Published Feb 6, 2021, 1:07 PM IST
Highlights

మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డిపై ఆంక్షలు విధిస్తూ ఏపీ ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ జారీ చేసిన ఆదేశాలపై ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ ప్రతిస్పందించారు.

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ (ఎపీఎస్ఈసీ) నిమ్మగడ్డ రమేష్ కుమార్ జారీ చేసిన ఆదేశాలపై డీజీపీ గౌతమ్ సవాంగ్ స్పందించారు. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డిపై పలు ఆంక్షలు విధిస్తూ వాటిని అమలు చేయాలని నిమ్మగడ్డ రమేష్ కుమార్ డీజీపీకి లేఖ రాశారు. 

నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఆ ఆదేశాలు జారీ చేసిన సమయంలో డీజీపీ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భద్రతా ఏర్పాట్లపై మీడియా సమావేశంలో మాట్లాడుతున్నారు. నిమ్మగడ్డ రమేష్ కుమార్ జారీ చేసిన ఆదేశాలపై ఆయన స్పందించారు. అయితే తనకు ఇప్పటి వరకు ఏ విధమైన ఆదేశాలు అందలేదని ఆయన చెప్పారు. 

ఇదిలావుంటే, పంచాయతీరాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ (ఎపీఎస్ఈసీ) నిమ్మగడ్డ రమేష్ కుమార్ సంచలన ఆదేశాలు జారీ చేశారు. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని ఇంటికి మాత్రమే పరిమితం చేయాలని, ఆయన బయటకు రాకుండా చూడాలని నిమ్మగడ్డ ఆదేశాలు చేశారు. డీజీపీకి, ఎస్పీకి ఆయన ఆ ఆదేశాలు జారీ చేశారు. 

ఈ నెల 21వ తేదీ వరకు పెద్దిరెడ్డిపై ఆంక్షలను అమలు చేయాలని ఆయన చెప్పారు. మీడియాతో కూడా మాట్లాడేందుకు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని అనుమతించకూడదని ఆయన అన్నారు. ఎన్నికలు నిర్భయంగా జరిపించడానికే ఈ ఆంక్షలు విధించినట్లు తెలిపారు. 

చిత్తూరు, గుంటూరు జిల్లాల్లో ఏకగ్రీవాలపై నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఆదేశాలు జారీ చేయడంపై పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏకగ్రీవాలను వెంటనే ప్రకటించాలని, ఏకగ్రీవాలను ప్రకటించకపోతే ఆ అధికారులపై చర్యలు తీసుకుంటామని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి హెచ్చరించారు. ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఆదేశాలను అమలు చేయకూడదని ఆయన రిటర్నింగ్ అధికారులకు సూచించారు  నిమ్మగడ్డ ఆదేశాలను పాటించే అధికారులను బ్లాక్ లిస్టులో పెడుతామని ఆయన హెచ్చరించారు. 

దానిపై నిమ్మగడ్డ రమేష్ కుమార్ తీవ్రంగా ప్రతిస్పందించారు. పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి మాట్లాడిన విషయాలు ప్రచురితమైన పత్రికల కట్టింగ్స్ ను కూడా నిమ్మగడ్డ తన లేఖకు జత చేశారు. ఎన్నికలు సజావుగా జరగడానికే పెద్దిరెడ్డిపై ఆంక్షలు పెడుతున్నట్లు నిమ్మగడ్డ తెలిపారు. 

click me!