శుక్రవారం హైకోర్టు ఉత్తర్వులను కూడా ధిక్కరించి సీఆర్డీయే అధికారులు గ్రామాల్లోకి వచ్చి రాళ్లు పాతుతున్నారని మాజీ మంత్రి, టిడిపి నాయకులు దేవినేని ఉమామహేశ్వర రావు ఆరోపించారు.
అమరావతి: ప్రజారాజధానిగా అమరావతిని కొనసాగించాలని డిమాండ్ చేస్తూ 115 రోజులుగా 29 గ్రామాల ప్రజలు, రైతులు, కూలీల పోరాటం అందరికీ స్ఫూర్తిదాయకమైందని మాజీ మంత్రివర్యులు దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు. ఈ మేరకు నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. అమరావతి రైతుల త్యాగాలను అందరూ స్ఫూర్తిగా తీసుకోవాలన్నారు. కరోనా తీవ్రత నేపథ్యంలో కూడా లాక్ డౌన్ నిబంధనలు పాటిస్తూ ప్రాణాలకు తెగించి మహిళలు పోరాడుతూ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తున్నారని అన్నారు.
నెక్కల్లులో 33ఏళ్ల వ్యక్తి ఆలూరి ఫణీంద్ర అనేక ధర్నాలలో పాల్గొన్నారని... ఆయన ఇవాళ గుండెపోటుతో మరణించాడని అన్నారు. ఈ సందర్భంగా అతడి కుటుంబానికి ప్రగాఢ సంతాపం తెలియజేశారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థించారు.
శుక్రవారం హైకోర్టు ఉత్తర్వులను కూడా ధిక్కరించి సీఆర్డీయే అధికారులు గ్రామాల్లోకి వచ్చి రాళ్లు పాతుతున్నారని అన్నారు. దీంతో తీవ్ర మనస్థాపానికి గురయిన ఫణీంద్ర గుండె ఆగి చనిపోయాడని ఆరోపించారు. ఇందుకు ప్రభుత్వానిదే బాధ్యత కాదా అని నిలదీశారు. లాక్ డౌన్ సమయంలో సీఆర్డీయే అధికారులు రాళ్లు ఏవిధంగా పాతిస్తారని అడిగారు. ఏవిధంగా గెజిట్ ఇస్తారు అని ప్రశ్నించారు.
335 గెజిట్ పై వాలంటీర్ల సాయంతో స్కైప్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రైతులు అభ్యంతరాలు తెలపాలని చెబుతున్నారని గుర్తుచేశారు. కొంతమంది రైతులు వెళ్లి అభ్యంతరం తెలిపితే గ్రూప్ కాన్ఫరెన్స్ తీసుకుంటామంటూ అధికారులు నిన్న మధ్యాహ్నం రెండు గంటలకు కబురుపెట్టారని... అసలు ఇవన్నీ ఏంటని ప్రశ్నించారు.
''హైకోర్టు చాలా స్పష్టంగా ఆదేశాలు ఇచ్చింది. ఈ నెల 24 వరకు అభ్యంతరాలు తెలుపవచ్చని చెప్పింది. సీఆర్డీయే యాక్ట్ ప్రకారం 5 శాతం భూముల్లో అమరావతి ప్రాంతంలో పేదవారికి ఇళ్లు కట్టాలని ఉంది. టీడీపీ ప్రభుత్వంలో 5,500 ఇళ్లు నిర్మించడం జరిగింది. ఇవి పేదవారికి అప్పజెప్పకుండా జగన్ పక్కన పెట్టారు'' అని అన్నారు.
''హైకోర్టు ఆదేశాలను ధిక్కరించి ఇవాళ ఇష్టారాజ్యంగా జీవోలు ఇస్తున్నారు. సీఆర్డీయే రూల్స్ ను కూడా సవరిస్తామంటున్నారు. భూములు లాక్కోవాలని చూస్తున్నారు. జగన్, సజ్జల రామకృష్ణారెడ్డి, సీఆర్డీయే ఇంఛార్జ్ కమిషనర్, ప్రవీణ్ ప్రకాష్, ధనుంజయ్ రెడ్డి, అజయ్ కల్లం రెడ్డి అత్యుత్సాహం చూపిస్తున్నారు. ఏ విధంగానైనా సరే ఈ 5 గ్రామాల్లో భూములు లాక్కోవాలని జీవోలు 131, 107, 355 ఇచ్చారు'' అని ఆరోపించారు.
''కరోనా సమయంలో ప్రాణాలు కాపాడుకోవడానికి స్వీయ నిర్బంధంలో ఉండి పోరాటం చేస్తున్న అమరావతి ప్రాంత రైతులపై జగన్ కక్ష కట్టారు. హైకోర్టు తీర్పంటే లెక్కలేదు. ఇవన్నీ చూసి ఆలూరి ఫణీంద్ర మనమధ్య లేకుండా పోయారు. 55 మంది రైతులు బలిదానం అయ్యారు. అయినప్పటికీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు'' అని మండిపడ్డారు.
''అమరావతి ప్రజల పోరాటాన్ని ముందుకు తీసుకెళ్లాలనే లక్ష్యంతో ఇవాళ గొల్లపూడిలోని నా కార్యాలయంలో 115వ రోజున కరోనా నిబంధనలు పాటిస్తూ ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు సంఘీభావం తెలియజేయడం జరిగింది. గుంటూరు, కృష్ణా జిల్లా నాయకులు కూడా సంఘీభావం తెలియజేయడం జరుగుతుంది'' అని అన్నారు.
''వైసీపీ కార్యకర్తల కోసమే అమరావతిలో భూములు లాక్కుంటున్నారు. సీఆర్డీయే యాక్టును ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వైసీపీ కూడా సమర్థించింది. ఇప్పుడు అమరావతి ప్రజల పోరాటానికి టీడీపీతో పాటు అన్ని పక్షాలు మద్దతుగా ఉన్నాయి. ఎలక్షన్ కమిషనర్ కు కులాన్ని ఆపాదించారు. మూడు ముక్కలాటను జగన్ కట్టిపెట్టాలి'' అని సూచించారు.
''ఇవాళ మామిడి రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. వీరిని ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలమైంది. పులివెందుల అరటిని అన్ని జిల్లాల్లో డంప్ చేస్తూ ఇవే కొనాలని బెదిరిస్తున్నారు'' అని ఆరోపించారు.
''వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఏం చదువుకున్నారు. డాక్టర్ గా ఉన్నవారు ఉంటే బాగుంటుంది. వైసీపీలో ఒక్క డాక్టర్ కూడా లేరా. కొడాలి నాని 8వ తరగతి చదువుకున్నాడు. బూతులు మాట్లాడుతున్నాడు. నిన్న నెల్లూరులో వైసీపీ ఎమ్మెల్యే లుచ్ఛా అని మాట్లాడుతున్నాడు'' అని దేవినేని ఉమ మండిపడ్డారు.