
విజయవాడ : అకాల వర్షాలకు పంటలు నష్టపోయి తీవ్ర నష్టాలపాలైన రైతులను వైసిపి ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మాజీ మంత్రి, టిడిపి నేత దేవినేని ఉమామహేశ్వర రావు ఆందోళన వ్యక్తం చేసారు. బటన్ నొక్కేసాము... రైతులకు నష్టపరిహారం చేసామంటూ తాడేపల్లి పిల్లి మసిపూసి మారేడుకాయ చేయాలని చూస్తున్నాడని అన్నారు. కానీ టిడిపి అధ్యక్షులు చంద్రబాబు నాయుడు రెండురోజుల పర్యటనలో ప్రభుత్వం బట్టలు విప్పదీసి చూపిస్తున్నాడని దేవినేని ఉమ ఘాటు వ్యాఖ్యలు చేసారు.
కొద్దిరోజులుగా కురుస్తున్న వర్షాలతో నష్టపోయిన రైతులకు తగిన పరిహారం అందించి ఆదుకోవాలంటూ ఉమ నేతృత్వంలో టిడిపి బృందం ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డిల్లీరావును కలిసి వినతిపత్రం అందించారు. మాజీ మంత్రులు నెట్టెం రఘురామ్, జగ్గయ్యపేట మాజీ ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ (తాతయ్య), తిరువూరు నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జి శావల దేవదత్ తదితరులతో కలిసి విజయవాడలోని కలెక్టరేట్ కు వెళ్ళి రైతులకు అండగా వుండాలని కలెక్టర్ ను కోరారు.
ఈ సందర్భంగా ఉమ మాట్లాడుతూ... అకాల వర్షాలకు రాష్ట్రంలో లక్షలాది ఎకరాల్లో పంటనష్టం జరిగిందన్నారు. కానీ ప్రభుత్వం మాత్రం కేవలం 60వేల ఎకరాల్లో రూ.34 కోట్ల విలువైన పంట మాత్రమే దెబ్బతిందంటూ తప్పుడు లెక్కలు చెబుతోందని అన్నారు. బాధిత రైతులకు సాయం చేయలేక అబద్దాలు చెబుతున్న ఈ దద్దమ్మ ప్రభుత్వానికి ప్రజలే బుద్ది చెబుతారని మాజీ మంత్రి హెచ్చరించారు.
Read More వైసీపీ మహిళా కార్యకర్త కుమార్తె చదువుకు చంద్రబాబు సాయం.. స్పాట్‌లోనే రూ. 2.3 లక్షలు అందజేత..!
సకాలంలో కొనుగోలు చేయకపోవవడంతో వర్షానికి నానిన ధాన్యం రంగుమారి మొలకెత్తిందని ఉమ అన్నారు. ఇలా మైలవరం మార్కెట్ యార్డ్ లో తడిసిన ధాన్యం, బూజుపట్టిన మొక్కజొన్న చూపించినందుకు ఇద్దరు వీఆర్వో, ఇద్దరు మార్కెట్ యార్డ్ ఛైర్మన్లపై... చూసినందుకు తనతో పాటు 13 మంది టిడిపి నాయకులపై కేసులు పెట్టారని తెలిపారు. ఇలా రైతుల బాధలు ప్రజలు చూపించినందుకు శాంతిభద్రతలకు విఘాతం కలిగించామంటూ 341, 143, 188 IPC 143/3 2023 సెక్షన్ల కిద పోలీసులతో కేసులు పెట్టించారని అన్నారు. కానీ ఇలాంటి అక్రమ కేసులతో తమ గొంతు నొక్కలేరని దేవినేని ఉమ హెచ్చరించారు.
వర్షాలతో పంటలు దెబ్బతిని బాధపడుతున్న అన్నదాతలను పరామర్శించి ధైర్యం చెప్పేందుకు చంద్రబాబు నాయుడు ప్రయత్నిస్తుంటే అడ్డుకోవాలని చూస్తున్నారని ఉమ ఆరోపించారు.దెబ్బతిన్న వరిపంట చూసేందుకు వెళుతుంటే అడ్డంగా బారీకేడ్లు పెడుతున్నారని మండిపడ్డారు. వారి అడ్డంకులను దాటుకున వెళ్లిమరీ చంద్రబాబు రైతుల బాధలు తెలుసుకుని భరోసా ఇస్తున్నారని ఉమ అన్నారు.
అహార, వాణిజ్య పంటలతో పాటు హార్టికల్చర్, కూరగాయలు కూడా ఈ అకాల వర్షాలకు బాగాదెబ్బతిన్నాయని ఉమ అన్నారు. కాబట్టి కాకిలెక్కలు పక్కనపెట్టి వర్షాలతో పంటలు దెబ్బతిన్న ప్రతి రైతుకు నష్టపరిహారం చెల్లించి ఆదుకోవాలని మాజీ మంత్రి దేవినేని ఉమ డిమాండ్ చేసారు.