చంద్రబాబు పాలనలో హరిత, స్వర్ణాంధ్రగా పిలవబడిన రాష్ట్రం నేడు జగన్ రెడ్డి పాలనలో గంజాయి, అప్పల ఆంధ్ర ప్రదేశ్ గా మారిందని మాజీ మంత్రి, టిడిపి నేత దేవినేని ఉమ ఎద్దేవా చేసారు.
గుడివాడ : నారా చంద్రబాబు నాయుడు పాలనలో హరిత, స్వర్ణాంద్రప్రదేశ్ గా వెలుగొందిన రాష్ట్ర జగన్ రెడ్డి పాలనలో గంజాయి, అప్పులు ఆంధ్ర ప్రదేశ్ గా మారిందని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఎద్దేవా చేసారు. ఈ నాలుగేళ్ళ దుష్ట, రాక్షస పాలనలో జగన్ రెడ్డి రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించాడని... అన్ని రంగాలు, వ్యవస్థలకు నిర్వీర్యం చేశాడని మాజీ మంత్రి ఆందోళన వ్యక్తం చేసారు.
రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బిసి, మైనారిటీ వర్గాల అణచివేతకు వైసిపి ప్రభుత్వం పూనుకుందని... ఆయా వర్గాలపై అక్రమ కేసులు బనాయింపు అందుకోసమేనని దేవినేని ఉమ అన్నారు. ముఖ్యంగా దళిత వర్గానికి చెందినవారు జగన్ పాలనతో తీవ్ర అణచివేతకు గురయ్యారని అన్నారు. ఇలా రాష్ట్ర ప్రజలను భయబ్రాంతులకు గురిచేస్తూ జగన్ రెడ్డి విధ్వంసానికి పాల్పడ్డాడని ఉమ ఆరోపించారు.
undefined
వైసిపి దుర్మార్గపు పాలనలో ప్రజలు పడుతున్న కష్టాలను తెలుసుకునేందుకే ప్రజా చైతన్య యాత్రలు, గౌరవ సభలను చంద్రబాబు నాయుడు రూపొందించారని అన్నారు. వీటి ద్వారా టిడిపి నాయకులంతా ప్రజల్లోకి వెళ్లేలా కార్యాచరణ రూపొందించారని అన్నారు. ఇక మొద్దు నిద్రలో వున్న జగన్ రెడ్డి ప్రభుత్వానికి కళ్ళు తెరిపించేలా స్వయంగా చంద్రబాబే 'బాదుడే - బాదుడు' కార్యక్రమాల్లో పాల్గొన్నారని ఉమ గుర్తుచేసారు.
వీడియో
జగన్ రెడ్డి దుష్ట పాలనను పారద్రోలాలని... మళ్లీ చంద్రబాబును ముఖ్యమంత్రి చేసుకోవాలని ఏపీ యువత చాలా ఆవేశంగా ఉందని ఉమ అన్నారు. ప్రజలంతా మళ్లీ టిడిపిని అధికారంలోకి తీసుకురావాలన్న పట్టుదలగా ఉన్నారన్నారు. జగన్ ప్రభుత్వాన్ని బంగాళాఖాతంలో కలిపేయాలన్న చంద్రబాబు మాటలు ప్రతి ఒక్క టిడిపి నాయకున్ని, కార్యకర్తను కదిలిస్తున్నాయని దేవినేని ఉమ పేర్కొన్నారు.
ఉమ్మడి కృష్ణా జిల్లాలో చంద్రబాబు నాయుడు చేపట్టే బహిరంగ సభలు, రోడ్ షోలను జయప్రదం చేయాలని ప్రజలను ఉమ కోరారు. చంద్రబాబు పర్యటనలో ప్రతి ఒక్క టిడిపి నాయకుడు, కార్యకర్త భాగస్వామ్యం కావాలని మాజీ మంత్రి దేవినేని ఉమ పిలుపునిచ్చారు.