జనసేన అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కొత్త లుక్ లో కనిపించారు. ఈ నెల 26 నుంచి వారాహీ దీక్ష చేపట్టనున్న ఆయన... కాషాయం ధరించారు. ఎమ్మెల్యేల శిక్షణ కార్యక్రమానికి అలాగే హాజరయ్యారు.
ఆంధ్రప్రదేశ్‌లో జనసేన పార్టీ తరఫున గెలిచిన ఎమ్మెల్యేలకు శాసనసభ వ్యవహారాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. విజయవాడలోని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ క్యాంపు కార్యాలయంలో జరిగిన కార్యక్రమానికి పవన్ కల్యాణ్ సహా 21 మంది ఎమ్మెల్యేలు హాజరయ్యారు. శాసనసభ వ్యవహారాలు, సభ నియమావళిని అధికారులు ఎమ్మెల్యేలకు వివరించారు.
ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సంప్రదాయ వస్త్రధారణలో ఈ శిక్షణ కార్యక్రమానికి హాజరయ్యారు. కాషాయ వస్త్రాలు ధరించారు. ఇందుకు కారణం ఏంటంటే.... పవన్ కల్యాణ్ రేపటి (జూన్ 26) నుంచి 11 రోజుల పాటు వారాహి అమ్మవారి దీక్షలో ఉండనున్నారు. ఎన్నికల్లో జనసేన పార్టీ ఘన విజయం సాధించిన నేపథ్యలో ఆయన ఈ దీక్ష చేపట్టనున్నారు. ఈ సందర్భంగా 11రోజుల పాటు ఉపవాస దీక్షలో ఉండనున్నారు.
డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కి దైవ భక్తి ఎక్కువ. ఆయన వారాహి అమ్మవారి భక్తుడు కూడా. అందువల్లే ఎన్నికల ప్రచారం కోసం తయారుచేసిన వాహనానికి వారాహీ అని పవన్ కల్యాణ్ పేరు పెట్టారు. తెలంగాణంలోని కొండగట్టుతో పాటు విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై ఈ వాహనాన్ని ప్రారంభించే సమయంలో పూజలు నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల ప్రచారం కూడా ఈ వాహనం పైనుంచే చేసి.. పవన్ ఘన విజయం సాధించారు. జనసేన పోటీ చేసిన 21 అసెంబ్లీ, 2 పార్లమెంటు స్థానాల్లో వంద శాతం స్ట్రైక్ రేట్ విజయం సాధించింది. దీంతో వారాహి వాహనం సెంటిమెంట్ కూడా కలిసి వచ్చినట్లయింది.
ఇక, 11 రోజుల పాటు వారాహీ దీక్ష పాటించనున్న ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్... దీక్ష పూర్తయ్యే వరకు ఉపవాసంలో ఉండనున్నారు. ఈ సమయంలో కేవలం పాలు, పండ్లు లాంటి కొద్దిపాటి ఆహారాన్ని మాత్రమే తీసుకుంటారు.
గత ఏడాది జూన్‌లో కూడా పవన్ కల్యాణ్ వారాహి అమ్మవారి దీక్ష పాటించారు. వారాహీ విజయ యాత్ర చేపట్టిన సమయంలో అమ్మవారి దీక్ష చేపట్టారు. వారాహీ అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
పవన్ కల్యాణ్ పిఠాపురం నుంచి అసెంబ్లీ ఎన్నికల బరిలో దిగి.. ఘన విజయం సాధించారు. వైసీపీ అభ్యర్థి వంగా గీతపై 70వేల పచిలుకు మెజారిటీతో గెలుపొందారు. అలాగే జనసేన తరఫున పోటీచేసిన మరో 20 అసెంబ్లీ, 2 పార్లమెంటు నియోజకవర్గాల్లోనూ అభ్యర్థులను గెలిపించుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ-జనసేన-బీజేపీ ఘన విజయం వెనుక పవన్ కల్యాణ్ పాత్ర ఎందో ఉంది. ఈ విషయాన్ని సాక్షాత్తూ ప్రధాని మోదీ ప్రస్తవించారు.
ఇంతటి ఘన విజయం సాధించిన పవన్ కల్యాణ్ చంద్రబాబు ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రి హోదా దక్కించుకున్నారు. అలాగే 5 శాఖల మంత్రి కూడా అయ్యారు. పవన్ కల్యాణ్ తోపాటు జనసేన నుంచి మరో ఇద్దరు ఎమ్మెల్యేలు మంత్రులు కూడా అయ్యారు.