తెలుగుదేశం అధినేత, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కీలక ప్రకటన చేశారు. ఎన్నికల్లో విజయం కోసం పనిచేసిన కార్యకర్తలకు త్వరలోనే మంచి జరుగుతుందని ప్రకటించారు.
తెలుగుదేశం అధినాయకత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పార్టీ కోసం కష్టపడి పనిచేసిన వారికి త్వరలోనే నామినేటెడ్ పోస్టులు కేటాయించనున్నట్లు ఆ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ప్రకటించారు. తెలుగుదేశం కార్యకర్తలను వేధించిన వారిని, అక్రమార్కులను పార్టీలోకి తీసుకునేది లేదని స్పష్టం చేశారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు కేబినెట్ తొల సమావేశం సోమవారం జరిగింది. ఈ సందర్భంగా సూపర్ సిక్స్ పథకాల అమలుతో పాటు పలు కీలక నిర్ణయాలకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది.
కేబినెట్ భేటీ అనంతరం తెలుగుదేశం ఎమ్మెల్యేలు, ఇంఛార్జులు, పార్టీ అధ్యక్షులతో చంద్రబాబు టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా పలు హామీలిచ్చారు. సార్వత్రిక ఎన్నికల్లో అహర్నిశలు కష్టపడి కూటమి విజయం కోసం కృషి చేసిన నాయకులు, కార్యకర్తలకు సముచిత స్థానం ఉంటుందని స్పష్టంచేశారు. ఇటీవల జరిగిన ఎన్నికలను ప్రతి ఒక్కరూ సవాల్‌గా తీసుకుని పోరాడటం వల్లే ఘన విజయం సాధ్యమైందన్నారు. పార్టీ పిలుపునిచ్చిన కార్యక్రమాల్లో పాల్గొని పోరాడిన వారికి తప్పకుండా నామినేటెడ్ పోస్టుల్లో ప్రాధాన్యం ఉంటుందని హామీ ఇచ్చారు. కష్టపడ్డ వారి వివరాలను సేకరిస్తున్నామని... పార్టీ నేతలిచ్చే రిపోర్టులతో పాటు ఇతర మార్గాల్లోనూ రిపోర్టులు తెప్పించుకుని కష్టపడిన వారికే పదువులు వచ్చేలా చేస్తామని తెలిపారు. పార్టీ కోసం శ్రమించిన వారిని ఆదుకుంటేనే పార్టీ కూడా బలంగా ఉంటుందన్నారు.
చంద్రబాబు ఇంకా ఏమన్నారంటే...
‘‘ప్రతిపక్షంలో ఉన్న ఐదేళ్లపాటు బాదుడే బాదుడు, ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి, యువగళం, రా...కదలిరా, ప్రజాగళం లాంటి వివిధ కార్యక్రమాలతో ప్రజలతోనే ఉన్నాం. సాగునీటి ప్రాజెక్టులను కూడా సందర్శించి గత ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టాం. గత ఐదేళ్లపాటు కార్యకర్తలు, నాయకులపై వైసీపీ ప్రభుత్వం ఎన్నో అక్రమ కేసులు పెట్టింది. వీటన్నింటిని తట్టుకుని నిలబడ్డారు. ఎన్నికల్లో మూడు పార్టీల నేతలు, కార్యకర్తలు కలిసి పని చేయడం వల్ల 57 శాతం ఓట్లు సాధించి, 93 శాతం స్ట్రైక్ రేట్ తో గెలిచాం’’ అని సీఎం చంద్రబాబు అన్నారు.
అలాంటి వారికి నో ఎంట్రీ...
‘‘అధికారాన్ని అడ్డుపెట్టుకుని పార్టీకి, కార్యకర్తలకు నష్టంచేసి, వేధించిన వైసీపీ నేతలకు తెలుగుదేశం పార్టీలోకి ఎంట్రీ లేదు. పార్టీకి అన్యాయం చేసిన వారిని ఉపేక్షించేది లేదు. అధికారం వచ్చిందని స్వలాభం కోసం వచ్చే వారి పట్ల జాగ్రత్తగా వ్యవహరించాలి. ప్రజలు నమ్మకం పెట్టుకుని కూటమిని గెలిపించారు..వారి నమ్మకాన్ని నిలబెడదాం. పొత్తులో భాగంగా 31 మంది పార్టీ ఇంఛార్జులకు సీట్లు రాలేదు. అయినా వెనకడుగు వేయకుండా కూటమి గెలుపే లక్ష్యంగా పనిచేశారు. అందువల్లే చరిత్రలో లేనివిధంగా ఫలితాలొచ్చాయి. నేను కూడా ప్రతి శనివారం పార్టీ కార్యాలయానికి వెళ్లి కార్యకర్తలు, ప్రజల నుంచి వినతులు స్వీకరిస్తున్నా. రైట్ మ్యాన్... రైట్ పొజిషన్ అనే విధానంతో భవిష్యత్తులో నిర్ణయాలుంటాయి. 2029 ఎన్నికల్లో విజయానికి కూడా ఇప్పటి నుంచి ప్రణాళిక ఉండాలి’’ అని కేడర్‌కు సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేశారు.
రాష్ట్రంలో పండుగ వాతావరణం...
‘‘ప్రజలకు మంచి చేస్తే మనకు అనుకూల ఫలితాలే వస్తాయి. ఇచ్చిన మాట ప్రకారం హామీలు నెరవేర్చుతున్నాం. మెగా డీఎస్సీకి కేబినెట్ కూడా ఆమోదం తెలిపింది. ల్యాండ్ టైటిలింగ్ చట్టాన్ని గత ప్రభుత్వం స్వార్థం కోసం ప్రవేశపెట్టింది. దాని రద్దుకు కూడా నిర్ణయం తీసుకున్నాం. పెన్షన్లు రూ.3వేల నుంచి రూ.4వేలకు పెంచాం. మూడు నెలల బకాయిలు వెయ్యి చొప్పున కలిపి వచ్చే నెలలో రూ.7వేలు ఇవ్వబోతున్నాం. బకాయిలతో కలిపి రూ.7వేలు ఇవ్వడం దేశ చరిత్రలో ఎన్నడూ లేదు. దివ్యాంగులకు రూ.3వేల నుంచి ఒకేసారి రూ.6వేలకు పెంచాం. వచ్చే నెల పెన్షన్ల పంపిణీ సచివాలయ సిబ్బందితో ఉంటుంది. గత ప్రభుత్వం సచివాలయ సిబ్బందితో పెన్షన్లు ఇవ్వడం అసాధ్యమంది. సాధ్యం అవుతుందని చెప్పడానికే సచివాలయ సిబ్బందితో పింఛన్లు పంపిణీ చేపట్టబోతున్నాం. రాష్ట్రంలో ఒక పండుగ వాతావరణం రాబోతోంది. ప్రజల సాధికారత కోసం కూటమి ప్రభుత్వం పని చేస్తుంది. ఇచ్చిన మాట ప్రకారం ఫేజ్ -1 లో 183 అన్నా క్యాంటీన్లను రాష్ట్రంలో తిరిగి ప్రారంభించబోతున్నాం. ప్రజల భాగస్వామ్యంతో అన్నా క్యాంటీన్ల నిర్వహణ ఉంటుంది. సీఎంగా బాధ్యతలు చేపట్టిన నాడు చేసిన 5 సంతకాలకు కేబినెట్ భేటీలో ఆమోదం తెలిపాం’’ అని సీఎం చంద్రబాబు వివరించారు.
బీసీలకు ప్రాధాన్యం...
‘‘పల్లా శ్రీనివాసరావు గాజువాకలో రాష్ట్రంలోనే అత్యధిక మెజారిటీతో గెలిచారు. రాష్ట్ర చరిత్రలో ఇంత మెజారిటీ ఎన్నడూ రాలేదు. బీసీ వర్గానికి చెందిన పల్లా శ్రీనివాసరావును టీడీపీ రాష్ట్ర అధ్యక్షులుగా నియమించాం. గతంలోనూ బీసీలకే పార్టీ అధ్యక్ష పదవి ఇచ్చాం. ఈసారి కూడా బీసీలకే ఇచ్చాం. వెనుకబడిన వర్గాలకు టీడీపీ ప్రాధాన్యమిచ్చింది. ఇస్తుంది కూడా. స్పీకర్ పదవి కూడా బీసీ వర్గానికి చెందిన అయ్యన్న పాత్రుడికి ఇచ్చాం. కేబినెట్ కూర్పులోనూ సామాజిక సమతూకం పాటించాం’’ అని సీఎం చంద్రబాబు గుర్తుచేశారు.