జగన్ దేశ రాజకీయాలను శాసిస్తారు.. జీవితాంతం ఆయనతోనే: డిప్యూటీ సీఎం కృష్ణదాస్

Siva Kodati |  
Published : Sep 02, 2020, 04:10 PM IST
జగన్ దేశ రాజకీయాలను శాసిస్తారు.. జీవితాంతం ఆయనతోనే: డిప్యూటీ సీఎం కృష్ణదాస్

సారాంశం

దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆశయ సాధనకు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి కృషి చేస్తున్నారని ఉప ముఖ్యమంత్రి, రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన కృష్ణదాస్ తెలిపారు. 

దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆశయ సాధనకు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి కృషి చేస్తున్నారని ఉప ముఖ్యమంత్రి, రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన కృష్ణదాస్ తెలిపారు. అధికారంలోకి వచ్చిన ఏడాదిన్నర కాలంలోనే ప్రజల మనస్సులను గెలుచుకున్న సీఎం వైఎస్ జగన్ త్వరలో దేశ రాజకీయాలను శాసిస్తారని జోస్యం పలికారు.

సచివాలయం నాలుగో బ్లాక్ పబ్లిసిటీ సెల్ లో బుధవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి 11వ వర్ధంతి సందర్భంగా ఆయనకు ప్రజలు కులాలు, మతాలు, వర్గాలకతీతంగా ఘన నివాళులర్పించారని ధర్మాన చెప్పారు.

జనం మెచ్చిన జన నేతగా పేరొందిన వైఎస్ రాజశేఖర్ రెడ్డి రెండు పర్యాయాలు ముఖ్యమంత్రిగా పనిచేశారన్నారు. ఆయన హయాంలో తాను రెండు పర్యాయాలు ఎమ్మెల్యేగా పనిచేశానని ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ గుర్తు చేసుకున్నారు.

ముఖ్యమంత్రిగా పనిచేసిన కాలంలో వైఎస్ ప్రజారంజకమైన పాలన అందించారన్నారు. రైతులకు, కౌలు రైతులకు, పేదలకు లబ్ధి కలిగేలా ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేశారని కృష్ణదాస్ తెలిపారు. 104, 108, రాజీవ్ ఆరోగ్యశ్రీ, ఫీజు రియింబర్స్‌మెంట్, ఉచిత విద్యుత్ వంటి పథకాలు దేశంలోనే పేరుగాంచాయని గుర్తుచేశారు.

ముఖ్యంగా వ్యవసాయాధారతమైన ఆంధ్రప్రదేశ్ లో వ్యవసాయానికి అధిక ప్రాధాన్యత ఇచ్చారని ధర్మాన చెప్పారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణాన్ని తట్టుకోలేక 670 మందికి పైగా ప్రాణాలు విడవడం ఆయనకు ప్రజల్లో ఉన్న అభిమానానికి నిదర్శమన్నారు.

తమ లాంటి నేతలందరకూ దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి స్ఫూర్తిగా నిలిచారని డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ కొనియాడారు. ఆయన కుమారుడు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఆయన సాధనకు కృషి చేస్తున్నారన్నారు.

అధికారంలోకి వచ్చిన ఏడాదన్నర కాలంలోనే ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని ఆయన చెప్పారు. కరోనా కష్ట కాలంలోనూ ఎన్నో సంక్షేమ పథకాలు ప్రజలకు అందించారని... మరెన్నో పథకాలకు రూపకల్పన చేస్తున్నారని కృష్ణదాస్ తెలిపారు.

పదవుల కేటాయింపుల్లో బీసీలకు అధిక ప్రాధాన్యతిచ్చారని డిప్యూటీ ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ తెలిపారు. మహిళలకు కూడా పదవుల కేటాయింపులో 50 శాతం మేర అవకాశమిస్తున్నారన్నారు. ఇద్దరు బీసీ మంత్రులను రాజ్యసభకు పంపారన్నారు.

వారి స్థానంలో మరో ఇద్దరు బీసీలకు మంత్రులుగా అవకాశమిచ్చారని ఆయన గుర్తుచేశారు. వెనుబడిన కులానికి చెందిన తనకు ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చి గౌరవమిచ్చారని, ఆయన రుణం తీర్చుకోలేనిదని ధర్మాన కృష్ణదాస్ కృతజ్ఞతలు తెలియజేశారు

PREV
click me!

Recommended Stories

Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?
IMD Cold Wave Alert : ఈ సీజన్లోనే కూలెస్ట్ మార్నింగ్స్ .. 14 జిల్లాల్లో ఆరెంజ్, 19 జిల్లాల్లో ఎల్లో అలర్ట్