భరించలేకే బయటకు వచ్చాం.. ఫిరాయింపు నేతలు

By ramya neerukondaFirst Published 6, Sep 2018, 10:59 AM IST
Highlights

కేసుల మాఫీ కోసం కేంద్రంతో మీ చీకటి ఒప్పందాలు, బీజేపీతో మీ పార్టనర్‌షిప్‌ చూసి సహించలేకే దూరమయ్యాం. ఫ్యాక్షన్‌ పునాదుల మీద నిర్మించిన మీ ఫ్యూడల్‌ మనస్తత్వాన్ని సమర్థించలేక, మానసిక సంఘర్షణ భరించలేక వచ్చేశాం.

వైసీపీ నుంచి టీడీపీలోకి ఫిరాయించిన నేతలపై వేటు వేస్తేనే.. తాము అసెంబ్లీ సమావేశాలకు హాజరౌతామని వైసీపీ నేతలు బుధవారం స్పీకర్ కి బహిరంగ లేఖ రాసిన సంగతి తెలిసిందే. కాగా.. ఆ లేఖకి సమాధానంగా ఫిరాయింపు నేతలు మరో లేఖ రాశారు.

‘‘మీ ఫ్యూడల్‌ వ్యవహార శైలి నచ్చకే బయటికి వచ్చాం. రాష్ట్రాభివృద్ధిని కాంక్షిస్తూ పని చేస్తున్న ముఖ్యమంత్రిని బలపరిచేలా అడుగులు వేశాం’’ అని స్పష్టం చేశారు. ‘‘వయసు లేదు, అనుభవం లేదు, స్వతహాగా వినే నైజం లేదు. కేవలం సహ నిందితుల సలహాలతోనే ముందుకు సాగాలన్న మీ ఆలోచన భరించలేక... అధికారమే పరమావధిగా, కుట్ర రాజకీయాలే ప్రధాన అజెండాగా కొనసాగిస్తూ, ప్రజలను ఓట్లు వేసే యంత్రాలుగా మాత్రమే చూసే నీచ మనస్తత్వాన్ని సహించలేక బయటకు వచ్చేశాం’’ అని తెలిపారు.
 
పట్టిసీమను, పోలవరం ప్రాజెక్టును అడ్డుకోవాలని, కొత్త రాజధానిని ఆ ప్రాంతంలో ఏర్పాటు చేయనివ్వకూడదని అంతర్గత సమావేశాల్లో చేసిన ఆదేశాలను జీర్ణించుకోలేకపోయామని, రాష్ట్ర ప్రభుత్వాన్ని కూల్చి వేస్తామని రాజ్‌భవన్‌ సాక్షిగా జగన్‌ చేసిన ప్రకటనను సహించలేకపోయామని లేఖలో తెలిపారు. ‘‘కేసుల మాఫీ కోసం కేంద్రంతో మీ చీకటి ఒప్పందాలు, బీజేపీతో మీ పార్టనర్‌షిప్‌ చూసి సహించలేకే దూరమయ్యాం. ఫ్యాక్షన్‌ పునాదుల మీద నిర్మించిన మీ ఫ్యూడల్‌ మనస్తత్వాన్ని సమర్థించలేక, మానసిక సంఘర్షణ భరించలేక వచ్చేశాం. మీ నాన్న రాజకీయ పుట్టుకే ఫిరాయింపుతో మొదలైందని గుర్తులేదా?’’ అంటూ లేఖలో పేర్కొన్నారు.

1978లో రెడ్డి కాంగ్రెస్‌ టికెట్‌పై గెలిచిన వైఎస్‌... రాజీనామా చేయకుండానే ఇందిరా కాంగ్రెస్‌లో చేరి మంత్రి కాలేదా? 1993లో ఏడుగురు టీడీపీ ఎంపీలను కాంగ్రె్‌సలోకి లాక్కొన్నప్పుడు ఈ విలువలు ఏమయ్యాయి? 2004లో 16 మంది టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలను వైఎస్‌ కాంగ్రె్‌సలో చేర్చుకోలేదా? అణు ఒప్పందంపై పార్లమెంటులో ఓటింగ్‌ సందర్భంగా ఇద్దరు టీడీపీ ఎంపీలను కాంగ్రెస్‌ వైపు
 
మళ్లించలేదా? 2009లో బాలనాగిరెడ్డి, ప్రసన్నకుమార్‌రెడ్డిలను తీసుకున్నప్పుడు ఎందుకు రాజీనామా చేయించలేదు? మీరు చేస్తే సంసారం, ఇతరులు చేస్తే వ్యభిచారమా? ఆ రోజు మీ తండ్రి ఎన్ని కోట్లకు అమ్ముడు పోయారు? మీ దగ్గరకొచ్చిన వాళ్లకు ఎన్ని కోట్లు ఇచ్చావు?’’ అని జగన్‌ను ఎమ్మెల్యేలు నిలదీశారు.

Last Updated 9, Sep 2018, 2:10 PM IST