
అమరావతి: నెల్లూరు జిల్లా ఉలవపాడు- తెట్టు రైల్వేస్టేషన్ల మధ్య దోపిడి దొంగలు రెచ్చిపోయారు. హైదరాబాద్ నుంచి చెన్నై సెంట్రల్ వెళ్తున్న హైదరాబాద్ ఎక్స్‌ప్రెస్ రైలులోని పలు బోగీల్లో దొంగలు బీభత్సం సృష్టించారు. ఉలవపాడు పరిధిలోని సుబ్బరాయుడు సత్రం గేటు వద్ద దుండగులు రైలును ఆపి లోనికి ప్రవేశించారు. దాదాపు మూడు బోగీల్లో అందినకాడికి దోచుకున్నారు. ఆదివారం అర్దరాత్రి దాటిన తర్వాత ఈ ఘటన చోటుచేసుకున్నట్టుగా ప్రయాణికులు తెలిపారు. దీనిపై రైల్వే అధికారులకు ఫిర్యాదు చేశారు.
అంతేకాకుండా సికింద్రాబాద్ నుంచి తాంబరం(తమిళనాడు) వెళ్తున్న చార్మినార్ ఎక్స్‌ప్రెస్‌లో కూడా దొంగలు చోరీకి యత్నించారు. తెట్టు సమీపంలో చార్మినార్ ఎక్స్‌ప్రెస్‌లో చోరీకి యత్నించగా.. వారిని రైలులోని పోలీసులు వారిని నిలువరించేందుకు యత్నించారు. ఈ క్రమంలోనే దొంగలు అక్కడి నుంచి పారిపోయారు. ఇక, ఈ ఘటనలకు సంబంధించి రైల్వే పోలీసులు విచారణ చేపట్టారు.