
yuva galam : బంగాళాఖాతంలో ఏర్పడిన మిచౌంగ్ తుఫాన్ ఆంధ్రప్రదేశ్, తమిళనాడుపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది. ఈ రెండు రాష్ట్రాల్లోని అనేక జిల్లాలో పలు నగరాలు జలమయమయ్యాయి. చల్ల గాలులు వీస్తుండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో టీడీపీ నాయకుడు నారా లోకేష్ ఆధ్వర్యంలో కొనసాగుతున్న యువగళం పాదయాత్రకు చిన్న బ్రేక్ పడింది.
ఈ తుపాను నేపథ్యంలో పాదయాత్రకు స్వల్ప విరామం ప్రకటించామని ఆ పార్టీ వర్గాలు తెలిపినట్టు ‘ఈనాడు’ పేర్కొంది. ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో రెడ్ అలెర్ట్ ప్రకటించారు. దీంతో మూడు రోజుల పాటు ఈ పాదయాత్ర తాత్కాలికంగా ఆగిపోనుంది.
ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్ మెంట్ కేసులో టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు అరెస్టు కావడంతో యువగళం పాదయాత్ర అర్థాంతరంగా ఆగిపోయింది. ఈ కేసులో ఆయన విడుదల కావడంతో మళ్లీ ఇటీవలే ఈ పాదయాత్ర పున: ప్రారంభమైంది. ఈ యాత్ర ప్రస్తుతం కాకినాడ జిల్లాలో కొనసాగుతోంది. ఈ జిల్లాలోని పలు ప్రాంతాల్లో తుఫాను వల్ల ఈదురుగాలులు వీయడంతో పాటు భారీ వర్షాలు కూడా కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో పాదయాత్రకు స్వల్ప విరామం ఇవ్వాలని టీడీపీ భావించింది. మూడు రోజుల తరువాత యథావిధిగా ప్రారంభం కానుంది.
ఇదిలా ఉండగా.. మిచౌంగ్ తుఫాను వల్ల ఏపీలోని తిరుపతి, తిరుమలలో శనివారం నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు కపిలతీర్థం, మాల్వానీ గుండం జలపాతాలు జలకళను సంతరించుకున్నాయి. జలపాతాలను చూసేందుకు నగర ప్రజలు కపిలతీర్థం వద్దకు తరలివచ్చారు. ఇదే సమయంలో తిరుమల, తిరుపతి అనేక ప్రాంతాల్లో భారీ వర్షంతో జలమయం అయ్యాయి. దీంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రవాణా వ్యవస్థ సైతం తీవ్రంగా ప్రభావితమైంది. రానున్న కొన్ని గంటల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరికలు నేపథ్యంలో అధికారులు అప్రమత్తమయ్యారు. ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు.