Cyclone Michaung : ఆ పట్టణాల ప్రజలు తస్మాత్ జాగ్రత్త... రాగల ఐదుగంటల్లో అత్యంత భారీ వర్షాలు

Arun Kumar PUpdated : Dec 04 2023, 09:41 AM IST

మిచాంగ్ తుఫాను ప్రభావంతో ఇప్పటికే ఆంధ్ర ప్రదేశ్ లో వర్షాలు కురుస్తుండగా ఇవాళ మరింత తీవ్రరూపం దాల్చనున్నట్లు వాతావరణ శాఖ ప్రకటించింది. 

తిరుపతి : బంగాళాఖాతంలో ఏర్పడిన మిచాంగ్ తుఫాను ఆంధ్ర ప్రదేశ్ ను వణికిస్తోంది. రాష్ట్రంవైపు దూసుకువస్తున్న ఈ తుఫాన ప్రభావంతో భారీ నుండి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం వుందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది.  మరీముఖ్యంగా రాగల ఐదు గంటల్లో నెల్లూరు, తిరుపతి పట్టణాల్లో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశాలు వున్నాయని... ప్రజలు అప్రమత్తంగా వుండాలని హెచ్చరించారు.  

మిచాంగ్ తుఫాను ప్రభావంతో ఇవాళ, రేపు భారీ వర్షాలు కురసే అవకాశాలున్న జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీచేసింది.  ఇవాళ అంబేద్కర్ కోనసీమ, పశ్ఛిమ గోదావరి, కృష్ణా, బాపట్ల, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, కడప, తిరుపతి,  చిత్తూరు జిల్లాల్లో భారీ నుండి భారీ వర్షాలు కురవనున్నాయని హెచ్చరించారు. ఈ జిల్లాల్లో ఒకటి రెండు చోట్ల అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించారు. అందువల్లే ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీచేసారు. 

ఇక కాకినాడ, తూర్పు గోదావరి, ఏలూరు, పల్నాడు, నంద్యాల, సత్యసాయి, ఎన్టీఆర్ జిల్లాల్లో కూడా వర్షాలు కురిసే అవకాశం వుందట. ఈ జిల్లాల్లో అక్కడక్కడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే సూచనలున్నాయట. దీంతో ఈ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసారు. 

Also Read  Cyclone Michaung : దంచికొడుతున్న వర్షం.. అధికారులు అలర్ట్ , ప్రకాశం జిల్లాలో విద్యా సంస్థలకు సెలవు

శ్రీకాకుళం, విశాఖపట్నం, పార్వతీపురం మన్యం, విజయనగరం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, కర్నూలు, అనంతపురం జిల్లాల్లో మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం వుందట. అందువల్ల ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్ ప్రకటించారు. 

ఇక ఈ వర్షాలు రేపు(మంగళవారం) కూడా కొనసాగుతాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. తుఫాను ప్రభావం కోస్తాంధ్ర జిల్లాలపై ఎక్కువగా వుండనుందని హెచ్చరించారు. తుఫాను ప్రభావంతో సముంద్రం అల్లకల్లోలంగా వుంటుంది కాబట్టి మత్స్యకారులు చేపల వేటకు వెళ్ళకూడదని హెచ్చరించారు. 

ప్రస్తుతం నైరుతి బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఈ మైచాంగ్ తుఫాను గంటకు 14 కిలోమీటర్ల వేగంతో ఉత్తర వాయువ్య దిశగా పయనిస్తోందని ఐఎండి తెలిపింది. ప్రస్తుతం నెల్లూరుకు ఆగ్నేయంగా 220 కిలోమీటర్ల దూరంలో, మచిలీపట్నంకు ఆగ్నేయంగా 350 కిలోమీటర్ల దూరంలో తుపాను కేంద్రీకృతం అయివుంది. ఇది  
ఇది నెల్లూరు- మచిలీపట్నం మధ్య  తీరందాటే సూచనలున్నాయని తెలిపారు. ఈ సమయంలో తీరంవెంబడి గంటకు 90- 110 కి.మీ వేగంతో బలమైన గాలులు వీచే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ హెచ్చరించింది.  
 


 

click me!