తీవ్ర తుఫాన్‌గా అసని.. ఏపీలో భారీ వర్షాలు.. రేపు, ఎల్లుండి హై అలర్ట్..

Published : May 09, 2022, 10:14 AM IST
తీవ్ర తుఫాన్‌గా అసని.. ఏపీలో భారీ వర్షాలు.. రేపు, ఎల్లుండి హై అలర్ట్..

సారాంశం

ఆగ్నేయ బంగాళాఖాతంలో అసని తుఫాన్ కొసాగుతుంది. ఇది తీవ్ర తుఫాన్‌గా మారింది. ఈ ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లోని పలు జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. 

ఆగ్నేయ బంగాళాఖాతంలో అసని తుఫాన్ కొసాగుతుంది. ఇది తీవ్ర తుఫాన్‌గా మారింది. ఇది వాయువ్యదిశగా ప్రయాణిస్తుందని.. మే 10వ తేదీ వరకు ఉత్తర కోస్తాంధ్ర, ఒడిశా తీరంలోని పశ్చిమ ప్రాంతానికి దగ్గరగా వస్తుందని భారత వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ఇది అతి తీవ్ర తుఫాన్‌గా మారే అవకాశం ఉందని కొందరు నిపుణులు పేర్కొంటున్నారు. ఇక, ప్రస్తుతం అసని తుఫాన్ విశాఖకు ఆగ్నేయంగా 670 కి.మీ దూరంలో కేంద్రీకృతం అయింది. రేపు రాత్రికి ఇది పశ్చిమ మధ్య బంగాళాఖాతంలోకి ప్రవేశించనుందని వాతావరణ శాఖ అధికారులు చెప్పారు. గంటకు 19 కి.మీ వేగంతో ప్రయాణిస్తూ దిశ మార్చుకునే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. 

తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో గంటకు 100 కి.మీపైగా వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. తీవ్ర తుఫాన్‌ ప్రభావంతో బంగాళాఖాతంలో అలల తీవ్రత ఎక్కువగా ఉంది. ఈ క్రమంలోనే విశాఖపట్నం, గంగవరం, కాకినాడ, మచిలీపట్నం, నిజాంపట్నం, కృష్ణపట్నం పోర్టుల్లో రెండో ప్రమాద హెచ్చరిక జారీచేశారు. మత్స్యకారులు గురువారం వరకు సముద్రంలో వేటకు వెళ్లవద్దని అధికారులు హెచ్చరించారు.  

తీవ్ర తుఫాన్ ప్రభావంతో ఇప్పటికే ఏపీ కోస్తా తీరం వెంబడి బలమైన గాలులు వీస్తున్నాయి. ఆదివారం పలు కోస్తా జిల్లాలో వర్షాలు కురిసాయి. అనంతపురం, కడప జిల్లాలో కూడా కొన్ని చోట్ల వర్షాలు పడుతున్నాయి. అకాల వర్షాలతో పలుచోట్ల పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. విజయవాడ నగరంలో ఈదురుగాలులు బీభత్సం సృష్టించాయి. దీంతో ప్రజలు తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. అవనిగడ్డ కృష్ణా కరకట్టపై ఉన్న వృక్షాలు నెలకొరిగాయి. 

ఇక, తుఫాన్ ప్రభావంతో ఏపీలో పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. మే 10, 11 తేదీల్లో కూడా ఏపీలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. రేపు సాయంత్రం నుంచి ఉత్తర కోస్తాంధ్రలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. మే 11న ఒడిశా కోస్తా తీరం, ఉత్తర కోస్తాంధ్ర, పశ్చిమ బెంగాల్ తీర ప్రాంతాల్లోని కొన్ని ప్రదేశాలలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. 

PREV
click me!

Recommended Stories

IMD Rain Alert: ఇక కాస్కోండి.. తీరం దాటిన తీవ్ర వాయుగుండం.. ఈ ప్రాంతాల్లో అల్ల‌క‌ల్లోల‌మే. భారీ వ‌ర్షాలు.
CM Chandrababu Speech: అవకాశం చూపిస్తే అందిపుచ్చుకునే చొరవ మన బ్లడ్ లోనే వుంది | Asianet News Telugu