అమరావతి : పోలవరం ప్రాజెక్టులో 2017-18 ధరలకు సంబంధించిన డీపీఆర్2 అంశాలను కొలిక్కి తెచ్చేందుకు సోమవారం ఢిల్లీలో భేటీ ఏర్పాటు చేశారు. కొత్త డీపీఆర్ ఆమోదం విషయం నెలల తరబడి కేంద్రంలో పెండింగులో ఉంది. కొత్త ధరలు ఆమోదించకపోవడంతో పోలవరం బిల్లులు వెనక్కి తిరిగి వచ్చి నిధుల సమస్య ఏర్పడుతోంది.
అమరావతి : పోలవరం ప్రాజెక్టులో 2017-18 ధరలకు సంబంధించిన డీపీఆర్2 అంశాలను కొలిక్కి తెచ్చేందుకు సోమవారం ఢిల్లీలో భేటీ ఏర్పాటు చేశారు. కొత్త డీపీఆర్ ఆమోదం విషయం నెలల తరబడి కేంద్రంలో పెండింగులో ఉంది. కొత్త ధరలు ఆమోదించకపోవడంతో పోలవరం బిల్లులు వెనక్కి తిరిగి వచ్చి నిధుల సమస్య ఏర్పడుతోంది.
ముఖ్యమంత్రి జగన్ మూడు రోజుల కిందట ఢిల్లీలో జల్‌శక్తి మంత్రి షెకావత్‌ను కలిసి పోలవరం డీపీఆర్‌పై చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ నేపథ్యంలో కేంద్ర మంత్రి నుంచి అందిన సూచనల మేరకు సోమవారం ఈ సమావేశం ఏర్పాటైంది. సీఎస్ ఆదిత్యనాథ్ దాస్, జల వనరులశాఖ కార్యదర్శి శ్యామలరావు, ఈఎన్‌సీ సి.నారాయణరెడ్డి, పోలవరం సీఈ సుధాకర్‌బాబు తదితరులు ఢిల్లీ వెళ్లారు. కేంద్ర జల వనరులశాఖ కార్యదర్శి పంకజ్ కుమార్, పోలవరం అథారిటీ సీఈవో చంద్రశేఖర్ అయ్యర్, కేంద్ర జల సంఘం ఛైర్మన్ హల్దార్ తదితరులు ఈ సమావేశంలో పాల్గొంటారు.
డీపీఆర్2పై తాము కొన్ని ప్రశ్నలకు సమాధానాలను కోరామని ఇటీవలే పోలవరం అథారిటీ తెలిపింది. ఆ సందేహాలకు ఇప్పటికే సమాధానాలను పంపినట్లు జల వనరులశాఖ అధికారులు చెప్పారు. డీపీఆర్2 గురించి రాష్ట్రం నుంచి అందించాల్సిన సమాచారం ఏదీ లేదని అధికారులు అంటున్నారు. ప్రస్తుతం కేంద్ర జల వనరులశాఖ కొత్త డీపీఆర్‌కు పెట్టుబడి అనుమతి ఇవ్వాల్సి ఉంది.
ఆ తర్వాత కేంద్ర మంత్రి మండలి ఆమోదానికి పంపాలి. సాధారణంగా మంత్రి మండలి ఆమోదం అవసరం ఉండదని, గతంలో ఒకసారి దీన్ని మంత్రి మండలికి పంపినందున ప్రస్తుతం అదే సంప్రదాయమూ కొనసాగే పరిస్థితి ఉందని జల వనరులశాఖ అధికారులు చెబుతున్నారు.
రూ.7,931 కోట్ల కోత : పోలవరం డీపీఆర్2కు సాంకేతిక సలహా కమిటీ రూ.55,656 కోట్లకు అనుమతి ఇచ్చింది. తర్వాత రివైజ్డు కాస్ట్ కమిటీ ఆ మొత్తంలోనూ కోత పెట్టింది. రూ.47,725 కోట్లకే ఆమోదించింది. రాష్ట్ర ప్రభుత్వం, అధికారులు రూ.55,656 కోట్లకే పెట్టుబడి అనుమతి అవసరమని వాదిస్తున్నారు. భూసేకరణకు రూ.2,877 కోట్లు, పునరావాసానికి రూ.2,118 కోట్లు ఎడమ కాలువలో రూ.1,482 కోట్లు, కుడి కాలువలో రూ.1,418 కోట్ల మేర రివైజ్డు కమిటీ కోత పెట్టింది.
ఆ మొత్తాలకు ఆమోదం కావాలంటూ ఏపీ జల వనరులశాఖ అధికారులు తమ వాదనను, అందుకు తగ్గ ఆధారాలను చూపుతున్నారు. ఈ అంశంపైనా ఢిల్లీలో సోమవారం ఓ కొలిక్కి వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు. కేంద్రం పెట్టుబడి అనుమతి ఇస్తే అడుగు ముందుకు పడినట్లవుతుంది.