అంతర్రాష్ట్ర రవాణాకు అనుమతి... ఆ వాహనాలకు మాత్రమే: మంత్రి పేర్ని నాని

By Arun Kumar PFirst Published Apr 15, 2020, 7:44 PM IST
Highlights
కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో మే3 వరకు లాక్ డౌన్ పొడిగించడంతో కొన్ని అత్యవసర సరుకు రవాణా వాహనాల అంతర్రాష్ట రవాణాకు అనుమతిస్తున్నట్లు మంత్రి పేర్ని నాని వెల్లడించారు. 
మచిలీపట్నం: అత్యవసర సమయంలో విధుల్లోకి వచ్చే డ్రైవర్లు, క్లీనర్లకు కోవిడ్-19 డ్రైవర్ ప్రొటెక్షన్ కిట్స్ అందజేస్తున్నట్లు ఏపీ రవాణా శాఖ మంత్రి పేర్ని నాని వెల్లడించారు.  లాక్ డౌన్ సమయంలో తప్పని పరిస్థితుల్లో రవాణా చేసే ట్రాన్స్ పోర్ట్ డ్రైవర్లకు ఏపీ రవాణా శాఖ ద్వారా కోవిడ్-19 డ్రైవర్ ప్రొటెక్షన్ కిట్స్ పంపిణీ చేస్తున్నామన్నారు. ఈ కిట్ల పంపిణీని మంత్రి మచిలీపట్నంలో ప్రారంభించారు. 

ఈ  సందర్భంగా మంత్రి నాని మాట్లాడుతూ... దేశవ్యాప్తంగా లాక్ డౌన్ ను మే 3వ తేదీ వరకు పొడిగించిన నేపథ్యంలో నిత్యావసరాలు, వ్యవసాయ ఉత్పత్తులు, మెడికల్ ఎక్యూప్ మెంట్ వంటి అత్యవసర సరుకుల అంతరాష్ట్రాల రవాణాకు అనుమతులు ఇచ్చామన్నారు. 

ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో సామాజిక సేవ కింద వీటి రవాణాకు ముందుకు వచ్చిన డ్రైవర్లు, క్లీనర్ల ఆరోగ్య బాధ్యత ప్రభుత్వంపై ఉందని... సీఎం జగన్ ఆదేశాల మేరకు రవాణా శాఖ ద్వారా కోవిడ్-19 డ్రైవర్ ప్రొటెక్షన్ కిట్స్ ను అందిస్తున్నామన్నారు. రాష్ట్రంలో అన్ని బ్రేక్ ఇన్సెక్టర్ల వద్ద కిట్లు సమృద్దిగా వున్నాయని... వారిద్వారా అత్యవసర వాహనాల డ్రైవర్లకు వీటిని అందించనున్నట్లు మంత్రి నాని ప్రకటించారు. 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ కేసుల సంఖ్య ఎప్పటికప్పుడు పెరుగుతోంది. తాజాగా ఏపీలో 19 కేసులు నమోదయ్యాయి. దీంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 502కు పెరిగింది. ఏపీలో ఇప్పటి వరకు కోవిడ్ -19 వల్ల 11 మంది మరణించారు. 

కొత్తగా పశ్చిమ గోదావరి జిల్లాలో 8, కర్నూలు జిల్లాలో 6, గుంటూరు జిల్లాలో 4 కేసులు నమోదయ్యాయి.కృష్ణా జిల్లాలో ఒక కేసు నమోదైంది. ఇప్పటి వరకు వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొంది 16 మంది డిశ్చార్జీ అయ్యారు. గుంటూరు జిల్లాలో అత్యధికంగా 118 కేసులు నమోదయ్యాయి. 97 కేసులతో కర్నూలు రెండో స్థానాన్ని ఆక్రమించింది. విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలు కరోనా వైరస్ ఉచ్చులో పడలేదు. 
 
click me!