కరోనాపై పోరు: నెల రోజుల బిడ్డతో ఆఫీసుకి.. విశాఖ కమీషనర్‌పై ప్రశంసలు

By Siva KodatiFirst Published Apr 9, 2020, 6:28 PM IST
Highlights

గ్రేటర్ విశాఖ మున్సిపల్ కమీషనర్ సృజన వృత్తిపట్ల తన అంకిత భావాన్ని చాటుకున్నారు. విశాఖలో ఉండే 30 లక్షలమందికిపైగా ప్రజలకు జవాబుదారీగా ఉన్నారు. తన నెల రోజుల పసికందుతో విధులకు హాజరవుతున్నారు.

కరోనాను కట్టడి చేసేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీవ్రంగా కృషి చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ను అమలు చేస్తున్నాయి. పోలీస్, మెడికల్, పారిశుద్ధ్య కార్మికులు, అధికార యంత్రాంగం రాత్రింబవళ్లు శ్రమిస్తున్నాయి.

ఈ నేపథ్యంలో గ్రేటర్ విశాఖ మున్సిపల్ కమీషనర్ సృజన వృత్తిపట్ల తన అంకిత భావాన్ని చాటుకున్నారు. విశాఖలో ఉండే 30 లక్షలమందికిపైగా ప్రజలకు జవాబుదారీగా ఉన్నారు.

Also Read:లాక్ డౌన్: 70 కి.మీ నడిచివెళ్లి ప్రియుడ్ని పెళ్లి చేసుకున్న బందరు యువతి

తన నెల రోజుల పసికందుతో విధులకు హాజరవుతున్నారు. ప్రతిరోజూ అధికారులు, సిబ్బందితో సమీక్ష చేస్తూ పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారు. కమీషనర్ సృజన నెల రోజుల క్రితం మగబిడ్డకు జన్మనిచ్చారు.

చిన్నారి ఆలనాపాలనా చూసుకోవాల్సిన ఆమె సెలవుల్ని వదిలేశారు. కరోనాతో ప్రజలు ఇబ్బందులు పడటంతో ఆమె తట్టుకోలేకపోయారు... వెంటనే వైరస్‌ను కట్టడి చేసేందుకు విధుల్లో చేరారు.

మొదటి మూడు వారాలు సృజన తన బిడ్డను వదిలేసి ఆఫీసుకు వచ్చారు. పిల్లవాడి బాగోగుల్ని భర్త, తల్లికి వదిలేశారు. విధి నిర్వహణలో తలమునకలు అవుతూనే మధ్య మధ్యలో బిడ్డను చూడటానికి వెళ్లొచ్చేవారు.

Also Read:లాక్ డౌన్ తో ఆదాయం కోల్పోయిన అర్చకులు... భారీ గ్రాంట్ ప్రకటించిన జగన్ సర్కార్

ఈ నేపథ్యంలో ఒళ్లో చంటిబిడ్డతో సృజన ఆఫీసులో ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు, విశాఖ ప్రజలు ఆమెను ప్రశంసించారు. దీనిపై స్పందించిన కమీషనర్ విశాఖ వాసులు ప్రస్తుతం ఆందోళనలో ఉన్నారని.. వారిలో ధైర్యం నింపాల్సిన బాధ్యత తమపై ఉందన్నారు.

కష్ట సమయంలో అండగా ఉండాలనే ఉద్దేశ్యంతో విధులకు హాజరవుతున్నానని  ఆమె చెప్పారు. అలాగే ప్రభుత్వం విధించిన లాక్‌డౌన్‌కు ప్రజలు సహకరించాలని, ఇళ్లలో నుంచి బయటకు రావొద్దని సృజన కోరారు. నిత్యావసరాలకు కొరత రానివ్వమని, ఆందోళన చెందొద్దని ఆమె హామీ ఇచ్చారు. 

click me!