గుంటూరు నగర శివారులోని ఏటుకూరు బైపాస్ వద్ద గల హోల్ సేల్ కూరగాయల మార్కెట్ మరో కోయంబేడ్ మార్కెట్ లా మారింది.
అమరావతి: గుంటూరు నగర శివారులోని ఏటుకూరు బైపాస్ వద్ద గల హోల్ సేల్ కూరగాయల మార్కెట్ మరో కోయంబేడ్ మార్కెట్ లా మారింది. ఇప్పటివరకు ఈ మార్కెట్‌లోని 26 మంది వ్యాపారులకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. మంగళవారం ఒక్కరోజే 18 మందికి వైరస్ సోకడంతో నగరంలో కలకలం రేగింది. దీంతో మార్కెట్‌ను పూర్తిగా మూసివేయించిన అధికారులు వ్యాధి నివారణ చర్యలు చేపట్టారు.
ఒకప్పుడు గుంటూరులో హోల్‌సేల్ కూరగాయల మార్కెట్ బస్టాండు పక్కనే ఉండేది. లాక్‌డౌన్ కారణంగా దాన్ని శివార్లలోని ఏటుకూరు బైపాస్ వద్దకు తరలించారు. ఇక్కడ పెద్దమొత్తంలో రిటైల్ వ్యాపారులు, వినియోగదారులు కూరగాయలు కొంటుంటారు. ఇక్కడి మార్కెట్లలో 450 మంది వ్యాపారులున్నారు. వీరందరికీ పరీక్షలు నిర్వహించగా 26 మందికి వైరస్ సోకినట్లు నిర్ధారణ అయ్యింది.
undefined
read more గుంటూరు జిల్లాలో హైఅలర్ట్... పెరిగిన కటైన్మెంట్ జోన్లు, జాబితా ఇదే
నగరంలోని రెడ్‌జోన్‌లో ఉంటూ నిత్యం మార్కెట్‌కు వచ్చే ఓ వ్యాపారికి తొలుత వ్యాధి లక్షణాలు బయటపడ్డాయని, ఆయన ద్వారానే అందరికీ వ్యాపించి ఉండొచ్చని అనుమానిస్తున్నారు. నగర కమిషనర్ అనూరాధ, డీఎస్పీ కమలాకర్ తదితరులు మార్కెట్‌ను సందర్శించారు. ఇక్కడ తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వ్యాపారవర్గాలతో చర్చించిన తర్వాతే మార్కెట్‌ను తెరుస్తామని అధికారులు తెలిపారు.
ఇదిలావుంటే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతోంది. రోజు రోజుకూ కరోనా వైరస్ వ్యాప్తిస్తూనే ఉంది. తాజాగా గత 24 గంటల్లో ఏపీలో 82 కోవిడ్ -19 కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3200కు చేరుకుంది. కోవిడ్ -19తో ఇప్పటి వరకు రాష్ట్రంలో 64 మంది మరణించారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత 24 గంటల్లో 12,613 శాంపిల్స్ ను పరీక్షించగా 82 మందికి కరోనా వైరస్ సోకినట్లు నిర్ధారణ అయింది. 40 మంది కోవిడ్ నుంచి కోలుకుని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జీ అయ్యారు. గత 24 గంటల్లో కరోనా వైరస్ కారణంగా ఏ విధమైన మరణాలు కూడా సంభవించలేదు.
ఇప్పటి వరకు మొత్తం 2209 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జీ కాగా, 927 మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. విదేశాల నుంచి వచ్చినవారిలో 112 మందికి కరోనా వైరస్ నిర్ధారణ అయింది. యాక్టివ్ కేసులు 111 ఉన్నాయి.
ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారిలో 479 మందికి కరోనా వైరస్ పాజిటివ్ ఉన్నట్లు తేలింది. వారిలో 282 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి. మిగతావారు కోలుకుని డిశ్చార్జీ అయ్యారు.