రేషన్ కార్డు లేకున్నా రూ.1000 ఆర్థిక సాయం..వారికి మాత్రమే: జగన్ సర్కార్ కీలక నిర్ణయం

By Arun Kumar PFirst Published Apr 14, 2020, 6:38 PM IST
Highlights

కరోనా మహమ్మారి రాష్ట్రంలోని ప్రజలందరినీ ఇబ్బంది పెడుతున్న నేపథ్యంలో ఏపి సీఎం జగన్ వారిని ఆదుకోడానికి మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. 

అమరావతి: కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో యావత్ దేశంలో లాక్ డౌన్ విధించిన విషయం తెలిసిందే. దీంతో ఉపాధి కోల్పోయిన నిరుపేద కుటుంబాలకు కేంద్ర, రాష్ట్ర  ప్రభుత్వాలు కలిసి ఉచితంగా రేషన్ సరుకులు అందించడంతో పాటు ఆర్థికసాయాన్ని కూడా చేస్తోంది. ఇలా ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ఇప్పటికే ప్రతి రేషన్ కార్డుదారుడికి వెయ్యిరూపాయల ఆర్థికసాయం చేయనున్నట్లు  ప్రకటించింది.  ఇదే సమయంలో ఇటీవల రేషన్ కార్డులకు అనర్హులుగా తేలినవారికి కూడా ఈ వెయ్యి రూపాయల ఆర్థికసాయం అందించాలని ముఖ్యమంత్రి జగన్ కీలక  నిర్ణయం తీసుకున్నారు. 

ఇప్పుడున్న రేషన్ కార్డుదారులతో పాటుగానే పాత రేషన్ కార్డులు ఉన్నవారికి కూడా వెయ్యి రూపాయలు పంపిణీ చేయాలని సంబంధిత అధికారులకు సీఎం ఆదేశించారు. ప్రస్తుతం కార్డులు ఉన్నవారికి మాత్రమే రూ.1000 పంపిణీ చేయాలని ముందుగా నిర్ణయించినా తమకూ ఈ సహాయం అందించాలని పాత రేషన్ కార్డుదారుల నుంచి అభ్యర్ధనలు వచ్చాయి.వీటిని పరిగణలోకి  తీసుకుని కరోనా సమయంలో ఏ ఒక్క కుటుంబం పస్తులుండకూడదన్న భావనతో సీఎం ఈ నిర్ణయం  తీసుకున్నట్లు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. 

ప్రజలెవ్వరూ ఆకలితో అలమటించకుండా వుండేందుకు ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుందని... ఇప్పటికే 1.30 కోట్లకు పైగా ప్రజలు ప్రభుత్వం ఉచితంగా అందించిన రేషన్ సరుకులు తీసుకున్నారని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాలి వెంకటేశ్వర రావు (నాని) వెల్లడించారు.  

వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా అధికారంలోకి వచ్చిన తరువాత 1.47 కోట్ల రేషన్ కార్డులపై విచారణ చేయించిందని... ఇందులో చంద్రబాబు ప్రభుత్వం 10 లక్షల కార్డులు అనర్హులుకు ఇచ్చారనే విషయం బయటపడిందన్నారు. దీంతో ఈ 10 లక్షల కార్డులను తొలగించడం జరిగిందన్నారు.

కరోనా మహమ్మారి సమయంలో సీఎం జగన్ పెద్ద మనస్సుతో గత ప్రభుత్వంలో మాదిరిగానే పాత రేషన్ కార్డుదారులకు కూడా ఉచిత రేషన్ సరుకులతో పాటు రూ. 1000 సాయం కూడా అందించనున్నారని తెలిపారు. అలాగే  రాష్ట్రంలో మరో 3 లక్షల మంది కొత్తగా  బియ్యం కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్నారని... వారికి కూడా సీఎం  ఉచిత రేషన్ సరుకులతో పాటు రూ. 1000 ఆర్థిక సహయం అందించమని అదేశాలు జారీ చేసినట్లు మంత్రి వెల్లడించారు. 

 సీఎం వైఎస్ జగన్ సారథ్యంలో ఉన్న ఈ ప్రభుత్వం పేద ప్రజలను ఆదుకునే ప్రభుత్వమని  అన్నారు.  చంద్రబాబులా పేదలను విస్మరించే ప్రభుత్వం కాదని పేర్కొన్నారు. పేదవాడి సంక్షేమ కోసం నిత్యం ఆలోచన చేసేది ముఖ్యమంత్రి జగన్మోహన్ ఒక్కరేనని  మంత్రి కొడాని నాని కొనియాడారు. 
 

click me!