కరోనా నేర్పిన పాఠం... వైద్యరంగ సేవలకు యువతకు ప్రత్యేక శిక్షణ

By Arun Kumar PFirst Published Apr 18, 2020, 8:32 PM IST
Highlights

కరోనా వైరస్ కారణంగా భవిష్యత్ లో రాష్ట్ర యువత ఇబ్బందులు పడకుండా చూసుకునే  చర్యలను ప్రారంభించింది జగన్ సర్కార్. 

అమరావతి: కరోనా నేపథ్యంలోనూ యువత భవిష్యత్ కు ఇబ్బంది రాకుండా వారికి ఉద్యోగ కల్పనే లక్ష్యంగా నైపుణ్య శిక్షణనిచ్చే విషయంపై దృష్టి పెట్టాలని జగన్ ప్రభుత్వం భావిస్తోందని సంబంధిత శాఖల మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి తెలిపారు. ముఖ్యంగా వైద్యరంగ సేవలకు శిక్షణ ఇవ్వడంతో పాటు విద్యార్థులు, అభ్యర్థుల భవిష్యత్ ను నిర్దేశించే కోర్సులు, పాఠ్య ప్రణాళిక రూపకల్పనలో అంతర్జాతీయ స్థాయి భాగస్వామ్యం వంటి కీలక అంశాలపై ప్రధానంగా దృష్టి పెట్టాలని  నైపుణ్యాభివృద్ధి శాఖ  ఉన్నతాధికారులకు సూచించారు. 

నైపుణ్యాభివృద్ధి, శిక్షణ శాఖపై మంత్రి గౌతమ్ రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు. తాజాగా నైపుణ్యాభివృద్ధి, శిక్షణ శాఖపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నిర్వహించిన సమీక్షలో ఇచ్చిన ఆదేశాల మేరకు కీలక అంశాలపై ఎలా ముందుకు వెళ్లాలన్నదానిపై నైపుణ్యాభివృద్ధి శాఖ  ఉన్నతాధికారులకు మంత్రి మార్గనిర్దేశనం చేశారు.  

ఐటీఐ, డిప్లొమో, ఇంజనీరింగ్ తదితర కోర్సులు పూర్తి చేసిన వారిలో నైపుణ్యాలు మెరుగుపరచడం, కోర్సులు చేస్తున్నవారికి ఒక సంవత్సరం అప్రంటీస్ ఇచ్చే అంశాలపై ప్రధానంగా దృష్టి సారించాలని సూచించారు. వివిధ కోర్సులు పూర్తి చేసుకున్న వారూ ఈ కేంద్రాలలో నైపుణ్యాలను అభివృద్ధి చేసుకునే వెసులుబాటు  కల్పించాలని... , అధ్యాపకులకు మరింత నైపుణ్యవంతులు (అప్ గ్రేడ్) గా తయారు చేసేందుకు ఇవ్వవలసిన శిక్షణ తరగతులు, శిక్షణా కేంద్రాల  నిర్వహణ వంటివాటిపైనా ప్రధానంగా చర్చించారు. 

మంత్రి గౌతమ్ రెడ్డి నిర్వహించిన ఈ వీడియో కాన్ఫరెన్స్ లో  ఏపి నైపుణ్యాభివృద్ధి శాఖ  ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి.అనంత రాము, ఛైర్మన్ మధుసూదన్ రెడ్డి, ఎండీ ఎ.శ్రీకాంత్ లు  పాల్గొన్నారు. 

click me!