కరోనా ఎఫెక్ట్... వైయస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం వాయిదా

By Arun Kumar PFirst Published Aug 11, 2021, 2:02 PM IST
Highlights

కరోనా కారణంగా మరో రెండురోజుల్లో జరగాల్సిన వైఎస్సార్ అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమాన్ని వాయిదా వేస్తున్నట్లు ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించింది. 

అమరావతి: రెండు రోజుల్లో జరగాల్సిన వైయస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమం వాయిదా పడింది.  వైయస్సార్‌ లైఫ్‌టైం ఎచీవ్‌మెంట్, వైయస్సార్‌ ఎచీవ్‌మెంట్‌ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమం ఆగస్ట్ 13న నిర్వహించాలని భావించినా కరోనా కారణంగా ఈకార్యక్రమాన్ని వాయిదా వేస్తున్నట్లు తెలిపారు. ఈ ఏడాది అక్టోబరు లేదా నవంబరు నెలల్లో ఈ అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమం నిర్వహించనున్నట్టు వైసిపి ప్రభుత్వం తెలిపింది. 

ఈ అవార్డు గ్రహీతల్లో పెద్ద వయస్సు ఉన్నవారు ఉండడటంతో పాటు, 150 మందికి మించి ఎక్కడా కూడా ప్రజలు గుమికూడదన్న వైద్య ఆరోగ్య శాఖ ఉత్తర్వులు నేపథ్యంలో అవార్డుల కార్యక్రమాన్ని వాయిదావేస్తున్నట్టుగా ప్రభుత్వం వెల్లడించింది. అవార్డు గ్రహీతల వయస్సు, వారి ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని, అలాగే వైద్య ఆరోగ్యశాఖ ఉత్తర్వులను దృష్టిలో ఉంచుకుని కార్యక్రమాన్ని వాయిదా వేశామని, వచ్చే అక్టోబరు లేదా నవంబరు నెలల్లో ఒక రోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని ప్రభుత్వం పేర్కొంది.

read more  ఏపీ: కొత్తగా 1461 మందికి పాజిటివ్... 19,82,287కి చేరిన కేసుల సంఖ్య

వైసిపి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వివిధ రంగాల్లో ప్రతిభ కనబర్చిన వారికి వైఎస్సార్ పేరిట అవార్డులు ప్రదానం చేస్తోంది. ఈ ఏడాది ఆగస్ట్ 13న అంటే వచ్చే శుక్రవారం అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించాలని జగన్ సర్కార్ భావించింది. ఇందుకోసం విజయవాడ ఏ1 కన్వెన్షన్‌ సెంటర్లో ఏర్పాట్లు కూడా చేశారు. అయితే  వైద్య ఆరోగ్య శాఖ కరోనా హెచ్చరికల నేపథ్యంలో ఈ కార్యక్రమాన్ని వాయిదా వేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.  

వివిధ రంగాల్లో విశేష కృషిచేసిన పలువురికి దివంగత ముఖ్యమంత్రి వైయస్‌.రాజశేఖరరెడ్డి పేరుమీద రాష్ట్ర ప్రభుత్వం వైయస్సార్‌ అవార్డులను ప్రకటించింది. వైయస్సార్‌ పుట్టినరోజయిన జులై 8న అవార్డులు ప్రకటించారు. వివిధ సంస్థలకు, వ్యవసాయం–అనుబంధ రంగాలకు, కళలు–సంస్కృతి రంగానికి, సాహిత్యంలో విశేష కృషిచేసిన వారికి, జర్నలిజం, వైద్య ఆరోగ్యం రంగంలో అసమాన సేవలు అందించిన వారికి అవార్డులు ప్రకటించారు. మొత్తంగా 29 మంది వైయస్సార్‌ లైఫ్‌టైం ఎచీవ్‌మెంట్‌ అవార్డుకు, ఎచీవ్‌మెంట్‌ అవార్డులను మరో 31 మందిని ఎంపిక చేశారు. అయితే వీరు అవార్డు అందుకోడానికి మరో రెండు మూడు నెలలు వేచిచూడాల్సిందే. 

click me!