సచివాలయానికి కాంట్రాక్టర్ తాళం, రోడ్డుపైకి సిబ్బంది... సీఎం జగన్ సొంత జిల్లాలోనే ఇదీ పరిస్థితి..

Arun Kumar P   | Asianet News
Published : Apr 28, 2022, 12:42 PM ISTUpdated : Apr 28, 2022, 12:48 PM IST
సచివాలయానికి కాంట్రాక్టర్ తాళం, రోడ్డుపైకి సిబ్బంది... సీఎం జగన్ సొంత జిల్లాలోనే ఇదీ పరిస్థితి..

సారాంశం

గ్రామ సచివాలయ భవనం నిర్మాణాన్ని సొంత డబ్బులతో పూర్తిచేసి ఏడాది గడుస్తున్నా ప్రభుత్వం బిల్లులు చెల్లించకపోవడంతో ఓ కాంట్రాక్టర్ ఆగ్రహానికి గురయ్యాడు. దీంతో సచివాలయానికి తాళం వేసి నిరసన తెలిపిన ఘటన కడప జిల్లాలో చోటుచేసుకుంది.  

అమరావతి: తన సొంత డబ్బులు వెచ్చించి గ్రామ సచివాలయ భవనాన్ని నిర్మించినా ఇప్పటివరకు ప్రభుత్వం బిల్లలు చెల్లించడంలేదని ఓ కాంట్రాక్టర్ తీవ్ర ఆగ్రహానికి గురయ్యాడు. సిబ్బందిని లోపలికి వెళ్లనివ్వకుండా సచివాలయ భవనానికి తాళం వేసుకున్నాడు. ఈ ఘటన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సొంత జిల్లా కడపలో చోటుచేసుకోవడంతో వైసిపి ప్రభుత్వంపై ప్రతిపక్షాలు విమర్శలకు తావిస్తోంది. 

వివరాల్లోకి వెళితే... వైఎస్సార్ కడప జిల్లా ఖాజీపేట మండలం అప్పనపల్లె పంచాయితీ మల్లాయపల్లెకు చెందిన వాసుదేవరెడ్డి కాంట్రాక్టర్. ప్రభుత్వం చేపట్టే అభివృద్ది పనులను కాంట్రాక్ట్ తీసుకుని పూర్తిచేసి ఇస్తుంటాడు. ఇలాగే తన గ్రామంలో సచివాలయ నిర్మాణానికి ప్రభుత్వ నిబంధనమేరకు కాంట్రాక్ట్ దక్కించుకున్నాడు. రూ.40లక్షలు వెచ్చించి కేవలం ఏడాది క్రితమే పూర్తిచేసాడు. 

తాను పుట్టిపెరిగిన గ్రామంపై అభిమానంతో సచివాలయ నిర్మాణానికి ప్రభుత్వ సూచించిన దానికంటే ఎక్కువ వ్యయం చేసాడు. అయితే ప్రభుత్వం మాత్రం రూ.32లక్షలు మాత్రమే మంజూరు చేసింది. మిగతా ఎనిమిది లక్షల కోసం అతడు అధికారుల చుట్టూ తిరుగుతున్నా ఫలితం లేకపోయింది. దీంతో ఆగ్రహించిన కాంట్రాక్టర్  వాసుదేవరెడ్డి ఇవాళ సచివాలయ భవనానికి తాళం వేసుకున్నాడు. 

సచివాలయానికి తాళంవేసి వుండటంతో సిబ్బంది బయటే చెట్లకింద కూర్చోవాల్సి వచ్చింది. అయితే అధికారులను నుండి ఏమయినా భరోసా వచ్చిందో ఏమోగాని కొద్దిసేపటి తర్వాత కాంట్రాక్టర్ సచివాలయానికి తాళం తీసాడు. దీంతో  సిబ్బంది లోపలికి వెళ్లారు.

తనకు రావాల్సిన రూ.8లక్షల కోసం పలుమార్లు అధికారులు, రాజకీయ నాయకులను కలిసినా ఎవ్వరూ స్పందించలేదని... అందువల్లే సచివాలయ భవనానికి తాళం వేసుకున్నట్లు కాంట్రాక్టర్ తెలిపాడు.  ఇప్పటికయినా అధికారులు తనకు రావాల్సిన బిల్లులు మంజూరు చేస్తారని ఆశిస్తున్నట్లు కాంట్రాక్టర్ వాసుదేవరెడ్డి తెలిపారు.  

ఇదిలావుంటే ప్రభుత్వం చేపట్టే అభివృద్ది పనుల కాంట్రాక్ట్ చేజిక్కించుకున్న కాంట్రాక్టర్లు సకాలంలో బిల్లులు మంజూరు కాక తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఈ క్రమంలోనే తమకు ప్రభుత్వం నుండి రావాల్సి బిల్లులు ఇప్పించాలంటూ కొందరు కాంట్రాక్టర్లుఏపీ హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై పలుమార్లు విచారణ జరిపిన న్యాయస్థానం అధికారుల నుండి సరయిన సమాధానం రాకపోవడంతో ఇటీవల సీరియస్ అయ్యింది. ఈ క్రమంలోనే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి స్వయంగా కోర్టుకు హాజరయి బిల్లుల చెల్లింపులో జాప్యంపై వివరణ ఇవ్వాల్సి వచ్చింది. 

ఈ సందర్భంగా పనులు చేయించుకొని కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించకపోతే ఎలా? అని సిఎస్ ను హైకోర్టు ప్రశ్నించింది. అయితే ప్రాధాన్యతా క్రమంలో బిల్లులు చెల్లిస్తున్నామని హైకోర్టుకు సిఎస్ సమీర్ శర్మ తెలిపారు. అందువల్లే కొందరు కాంట్రాక్టర్లకు కాస్త ఆలస్యంగా బిల్లులు చెల్లించాల్సి వస్తోందని సీఎస్ కోర్టుకు వివరించారు.

పనులు చేయించుకొని బిల్లులు చెల్లించకపోవడంతో కాంట్రాక్టర్లు చాలా ఇబ్బందులు పడుతున్నారని పిటిషనర్ తరపు న్యాయవాది వాదించారు. ఇలా సొంతం ఖర్చులతో పనులు చేసి సమయానికి ప్రభుత్వం నుండి బిల్లులు రాక కాంట్రాక్టర్ల కుటుంబాలు రోడ్డునపడే పరిస్థితి వచ్చిందని హైకోర్టుకు న్యాయవాది పేర్కొన్నారు.  ఈ క్రమంలోనే బిల్లులు చెల్లింపులో ఎందుకు ఆలస్యం అవుతుందని సిఎస్ ను ధర్మాసనం సూటిగా ప్రశ్నించింది. 

ఇకపై కాంట్రాక్టర్లను ఇబ్బంది పెట్టవద్దని... సకాలంలో బిల్లులు చెల్లించేలా అన్ని శాఖల కార్యదర్శులకు ఆదేశాలు ఇవ్వాలని సీఎస్ సమీర్  శర్మకు హైకోర్టు ఆదేశించింది. లేదంటే తామే ఆదేశాలివ్వాల్సి వస్తుందని హైకోర్టు హెచ్చరించింది. 
 

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : ఇక్కడ 8°C ఉష్ణోగ్రతలు, గడ్డకట్టే చలి.. ఈ ఏడు జిల్లాలకు డేంజర్ బెల్స్
IMD Rain Alert : అక్కడ వర్షాలు, ఇక్కడ చలి .. ఇక తెలుగు రాష్ట్రాల్లో అల్లకల్లోలమే..!