ఏపీలో టీడీపీ, కాంగ్రెస్.. ఒంటరి పోరే..

By ramya neerukondaFirst Published Jan 12, 2019, 9:57 AM IST
Highlights

ఈ ఎన్నికల్లో టీడీపీ- కాంగ్రెస్ పొత్తు పెట్టుకుంటారా లేదా అనే విషయంపై గత కొంతకాలంగా చర్చలు జరుగుతూనే ఉన్నాయి. కాగా.. పొత్తు లేకుండా ఒంటరిపోరు చేయడానికే రెండు పార్టీలు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది

త్వరలో ఏపీ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో టీడీపీ- కాంగ్రెస్ పొత్తు పెట్టుకుంటారా లేదా అనే విషయంపై గత కొంతకాలంగా చర్చలు జరుగుతూనే ఉన్నాయి. కాగా.. పొత్తు లేకుండా ఒంటరిపోరు చేయడానికే రెండు పార్టీలు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. తెలంగాణ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో.. పొత్తు విషయంలో ఇరు పార్టీలు సమాలోచనలో పడ్డాయి.

ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ గురువారం 29 రాష్ట్రాల పీసీసీ చీఫ్‌లతో ఢిల్లీలో సమావేశమయ్యారు. ఇతర రాష్ర్టాల పరిస్థితి ఎలా ఉన్నా... ఆంధ్రలో పరిస్థితి భిన్నంగా ఉందని రాష్ట్ర నేతలు చెబుతున్నారు. రాష్ట్ర విభజన కాంగ్రెస్‌ పార్టీవల్లే జరిగిందని ప్రజలు ఆగ్రహించడంతో 2014 ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీకి డిపాజిట్లు కూడా దక్కలేదు. అయితే.. ప్రధాని మోదీ రాష్ట్రానికి అన్యాయం చేశారని ప్రజలు ఇప్పుడు కోపంతో ఉన్నారని, కాంగ్రెస్‌ పార్టీపై 2014లో ఉన్నంత వ్యతిరేకత, ఆగ్రహం తగ్గి... ఇప్పుడు ఆదరణ పెరుగుతోందని అంటున్నారు. అయితే ఈ పెరిగిన ఆదరణ ఓటు బ్యాంకుగా మారుతుందో లేదో అన్న అనుమానం కూడా కాంగ్రెస్ నేతల్లో ఉంది.

బీజేపీ వ్యతిరేక కూటమిని ఏర్పాటుచేసేందుకు ఏపీ సీఎం చంద్రబాబు.. రాహుల్ గాంధీతో పలు సార్లు సమావేశమైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ తో పొత్తు కొనసాగించాలని అనుకున్నారు. అయితే.. తెలంగాణలో పెట్టుకున్న పొత్తు వికటించిన నేపథ్యంలో.. పార్టీ నేతలు పొత్తు విషయంలో భిన్నాభిప్రాయలు వ్యక్తం చేస్తున్నారు. దీంతో..ఈసారి ఎన్నికలు ఒంటరిగానే ఎదురుకోవాలని చూస్తున్నట్లు తెలుస్తోంది. 

click me!