
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రేపు నెల్లూరు జిల్లాలో పర్యటించనున్నారు. రామాయపట్నం పోర్టు పనులకు శంకుస్థాపన చేయనున్నారు. ఇందుకోసం రేపు ఉదయం 9.30 గంటలకు సీఎం జగన్ తాడేపల్లిలోని తన నివాసం నుంచి బయలుదేరనున్నారు. ఉదయం 10.40 గంటలకు రామాయపట్నం చేరుకోనున్నారు. ఉదయం 11 గంటల తర్వాత రామాయపట్నం పోర్టు పనులకు శంకు స్థాపన చేయనున్నారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం జగన్ పాల్గొంటారు. అనంతరం సీఎం జగన్ అక్కడి నుంచి తాడేపల్లికి బయలుదేరుతారు. మధ్యాహ్నం ఒంటి గంట తర్వాత తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు.
సీఎం పర్యటన నేపథ్యంలో అధికారులు పటిష్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు. కలెక్టర్ చక్రధర్ బాబు, ఎస్పీ సిహెచ్ విజయరావు, కందుకూరు ఎమ్మెల్యే మహీధర్ రెడ్డి.. మొండివారిపాలెంలో జరుగనున్న బహిరంగ సభ, హెలిప్యాడ్, శంకుస్థాపన ఏర్పాట్లను పరిశీలించారు. అనంతరం కలెక్టర్ మీడియాతో మాట్లాడుతూ శంకుస్థాపన అనంతరం సీఎం జగన్ ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారని చెప్పారు. పోర్టు కోసం భూములిచ్చిన రైతులకు పునరావాస చర్యల్లో భాగంగా సీఎం జగన్ పట్టాలు పంపిణీ చేయనున్నారని తెలిపారు.
ఎలాంటి లోటుపాట్లు జరగకుండా అన్ని ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నామని, పోర్టు నిర్మాణ పనులు వేగవంతం చేసేందుకు కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేస్తున్నామని కలెక్టర్ తెలిపారు. ఈ ప్రాజెక్ట్ ఓడరేవు ఆధారిత పరిశ్రమలకు కొత్త మార్గాలను తెరవడంతో పాటుగా.. ఈ ప్రాంతంలోని పెద్ద సంఖ్యలో నిరుద్యోగ యువతకు ఉపాధిని కల్పిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ప్రజాప్రతినిధుల సహకారంతో భూసేకరణ ప్రక్రియ తుదిదశకు చేరుకుందని.. నిర్వాసితులకు పునరావాస పనులు ఇప్పుడే ప్రారంభిస్తామని చెప్పారు. పోర్టు పనులు చేపట్టకముందే 2013 భూసేకరణ చట్టం ప్రకారం పోర్టు కోసం భూములిచ్చిన వారికి పరిహారం ప్యాకేజీ చెల్లిస్తామని హామీ ఇచ్చారు.