జగన్ మార్క్ డెసిషన్... నామినేటెడ్ పదవులు వీరికే?

By Arun Kumar PFirst Published Jul 13, 2021, 10:10 AM IST
Highlights

ఆంధ్ర ప్రదేశ్ లో నామినేటెడ్ పదవుల భర్తీ ప్రక్రియ వేగవంతమైనట్లు వైసిపి వర్గాల నుండి అందుతున్న సమాచారం. ఇవాళ లేకుంటే రేపు అధికారిక ప్రకటన వెలువడే అవకాశాలున్నట్లు సమాచారం.  

విశాఖపట్నం: ఏపీలో వైసీపీ నేతలు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న నామినేటెడ్ పదవులు ప్రకటనకు రంగం సిద్దమైంది. దాదాపుగా పదవుల కేటాయింపు కూడా పూర్తయినట్లు వైసిపి వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే ముఖ్యమంత్రి జగన్ నామినేటెడ్ పదవుల భర్తీకి అంగీకారం తెలుపుతూనే విశాఖ నాయకులకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించినట్లు సమాచారం. దీంతో ఈ రాత్రికి లేదా రేపు నామినేటెడ్ పోస్టులను ప్రకటించటం ఖాయంగా కనిపిస్తోంది. నామినేటెడ్ పదవుల్లో విశాఖకు తొలి ప్రాధాన్యత ఇస్తూ 11మందికి చైర్మన్ పదవులు, మరికొందరికి డైరెక్టర్ పదవులు ఖరారయినట్లు తెలుస్తోంది. 

నామినేటెడ్ పదవులు పొందే అవకాశాలున్నట్లు ప్రచారంలో వున్న పేర్లివే: 

విఎంఆర్ డీఏ చైర్మన్ గా అక్కరమాని విజయనిర్మల (విశాఖ తూర్పు నియోజకవర్గం)

రాష్ట్ర విద్యావిభాగం వెల్ఫేర్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవెలప్మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ గా మాజీ ఎమ్మెల్యే మళ్ల విజయప్రసాద్ (విశాఖ పశ్చిమ)

నెడ్ క్యాప్ చైర్మన్ గా కేకే రాజు (విశాఖ ఉత్తరం )

రాష్ట్రమైనారిటీ విభాగం ఛైర్మన్ గా జాన్ వెస్లీ ( విశాఖ దక్షిణం )

రాష్ట్ర గ్రంథాలయ కార్పొరేషన్ ఛైర్మన్ గా దాడి రత్నాకర్ ( అనకాపల్లి )

విశాఖ రీజియన్ పెట్రోకారిడార్ చైర్మన్ గా మాజీ ఎమ్మెల్యే తైనాల విజయకుమార్‌ ( విశాఖ ఉత్తరం )

స్మార్ట్ సిటీ కార్పొరేషన్ చైర్మన్ గా  ప్రముఖ ఆడిటర్ జీవి

జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ గా చింతకాయల సన్యాసిపాత్రుడు ( నర్సీపట్నం )

డీసీఎమ్ ఛైర్ పర్సన్ గా పల్లా చినతల్లి ( గాజువాక )
 
రాష్ట్ర బ్రాహ్మణ విభాగం చైర్మన్ గా సుధాకర్‌

డీసీసీబీ ఛైర్మన్ గా సుకుమార్ వర్మ కొనసాగింపు ( యలమంచిలి )

రాష్ట్ర స్థాయి నామినేటెడ్ పోస్టులో ప్రధానంగా 2019 ఎన్నికల్లో వైసీపీ అభ్యర్ధులుగా పోటీ చేసి ఓడిపోయిన వారికే ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలుస్తోంది. అందులో ప్రధానంగా ఆమంచి క్రిష్ణమోహన్, ఉరవకొండ విశ్వేశ్వరరెడ్డి, తోట వాణి, రౌతు సూర్యప్రకాశ రావు, దేవినేని అవినాశ్,బొప్పన భావన కుమార్,బాచిన చైతన్య వంటి పేర్లు ప్రచారంలో ఉన్నాయి. కుప్పంలో చంద్రబాబుపై పోటీ చేసి ఇటీవలే మరణించిన చంద్రమౌళి కుమారుడికి సైతం రాష్ట్ర స్థాయి పదవి ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. 
 


 

click me!