ఇసుక అక్రమ రవాణాతో సొమ్ము చేసుకుంటున్నారు.. సీఎం జ‌గ‌న్ పై నారా లోకేశ్ విమ‌ర్శ‌లు

Published : Feb 26, 2023, 09:33 AM IST
ఇసుక అక్రమ రవాణాతో సొమ్ము చేసుకుంటున్నారు.. సీఎం జ‌గ‌న్ పై నారా లోకేశ్ విమ‌ర్శ‌లు

సారాంశం

Vijayawada: తెలుగుదేశం పార్టీ (టీడీపీ) జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ యువ‌గ‌ళం పాద‌యాత్ర కొన‌సాగుతోంది. ఈ క్ర‌మంలోనే ఆయ‌న తిరుపతిలో భవన నిర్మాణ కార్మికులను ఉద్దేశించి మాట్లాడారు. టీడీపీ అధికారంలోకి రాగానే యుద్ధ ప్రాతిపదికన సమస్యలు పరిష్కరిస్తామని భవన నిర్మాణ కార్మికులకు హామీ ఇచ్చారు.   

TDP national general secretary Nara Lokesh: వైెస్సార్సీపీ ప్రభుత్వం, ముఖ్యమంత్రి వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ఇసుకు అక్ర‌మ ర‌వాణాతో సొమ్ము చేసుకుంటున్నార‌ని తెలుగుదేశం పార్టీ (టీడీపీ) జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఆరోపించారు. ప్ర‌స్తుతం ఆయ‌న‌ యువ‌గ‌ళం పాద‌యాత్ర కొన‌సాగుతోంది. ఈ క్ర‌మంలోనే తిరుపతిలో భవన నిర్మాణ కార్మికులను ఉద్దేశించి మాట్లాడారు. టీడీపీ అధికారంలోకి రాగానే యుద్ధ ప్రాతిపదికన సమస్యలు పరిష్కరిస్తామని భవన నిర్మాణ కార్మికులకు హామీ ఇచ్చారు.

వివ‌రాల్లోకెళ్తే.. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఇసుక అక్రమ రవాణా ద్వారా వేల కోట్లు దండుకుంటున్నారని నారా లోకేశ్‌ ఆరోపించారు. తన పాదయాత్ర 'యువ గళం' 27వ రోజుకు చేరుకుంది. తిరుప‌తిలోని అంకురా హాస్పిటల్ సమీపంలోని క్యాంప్‌సైట్‌లో భవన నిర్మాణ కార్మికులను ఆయ‌న క‌లుసుకున్నారు. కార్మికులు వారి సమస్యలను ఆయ‌న‌తో చెప్పుకున్నారు. ఇసుక, ఇనుము, ఇతర వస్తువుల ధరలు విపరీతంగా పెరగడంతో ఉపాధి కోల్పోయి అనేక మంది కార్మికులు ఇతర రాష్ట్రాలకు వలస వెళ్తున్నారని తెలిపారు. కార్మికులను కష్టాల నుంచి గట్టెక్కించేందుకు ఒక్కొక్కరికి రూ.10వేలు చెల్లిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చి అనేక పత్రాలు కూడా సేకరించింది కానీ ఇప్పటి వరకు ఒక్క రూపాయి కూడా చెల్లించలేద‌న్నారు.

భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ సెస్ నిధులను కూడా దారి మళ్లించారని ఫిర్యాదు చేశారు. వారికి కనీసం గుర్తింపు కార్డులు కూడా ఇవ్వడం లేదని అన్నారు. తన వద్ద కనీసం 20 మంది పనిచేస్తున్నారనీ, కొత్త భవనాలకు అనుమతులు ఇవ్వకపోవడంతో తాము ఉపాధి కోల్పోయామని ఓ ఎలక్ట్రీషియన్‌ లోకేశ్ కు చెప్పుకున్నారు. తమకు ప్రభుత్వం నుంచి భిక్ష అవసరం లేదనీ, కనీసం ఉపాధి అవకాశాలు కల్పించి జీవనోపాధి పొందాలని డిమాండ్ చేశారు. వారి సమస్యలపై స్పందించిన లోకేశ్.. మళ్లీ టీడీపీ ప్రభుత్వం ఏర్పడగానే వారి సమస్యలన్నీ యుద్ధప్రాతిపదికన పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ముఖ్య‌మంత్రి జగన్ మోహ‌న్ రెడ్డి పాల‌న‌లో బంగారం దొరుకుతుంది కానీ ఇసుక దొరకదని ఎద్దేవా చేశారు. 

ఇసుక అక్రమ విక్రయాల ద్వారా రోజుకు రూ.3 కోట్లు, నెలకు రూ.1,000 కోట్లు సీఎం కు సమకూరుతున్నాయ‌ని ఆరోపించారు. దీన్నిబట్టి అక్రమ ఇసుక విక్రయాల ద్వారా ఎంత సొమ్ము దండుకుంటున్నారో ఇట్టే ఊహించుకోవచ్చున‌ని అన్నారు. టీడీపీ హయాంలో టన్ను ఇసుక ధర కేవలం రూ.1,000 మాత్రమే ఉండేదని తెలిపిన లోకేశ్.. వైసీపీ అధికారంలోకి వచ్చాక అది రూ.5 వేలకు పెరిగిందని విమ‌ర్శించారు. తిరుపతిలో ఇద్దరు ఎమ్మెల్యేలు బి.కరుణాకర్ రెడ్డి, ఆయన కుమారుడు అభినయ్ రెడ్డి ఉన్నారనీ, ఇళ్ల నిర్మాణానికి అనుమతులు మంజూరు చేయడానికి కూడా వారిద్దరూ అక్రమంగా లక్షల రూపాయలు వసూలు చేస్తున్నారని ఆరోపించారు. బోరుబావులు తవ్వడానికి కూడా రెండు మూడు లక్షల రూపాయ‌లు చెల్లించాల్సి వస్తోందన్నారు. 

టీడీపీ అధికారంలోకి రాగానే భవన నిర్మాణ కార్మికులకు అన్ని రకాల సంక్షేమ పథకాలు అమలు చేస్తామనీ, వారి రుణాలను కూడా మాఫీ చేస్తామని నారా లోకేష్ హామీ ఇచ్చారు. అనంతరం వేలాది మంది యువకులు ఆయనకు స్వాగతం పలకడంతో ఆ శిబిరం నుంచి తన యుత గ‌ళం పాద‌యాత్ర‌ను తిరిగి ప్రారంభించారు. గత మూడున్నరేళ్లుగా రాష్ట్రంలో నిరుద్యోగం పెరిగిపోతోందని ఆయన వెంట నడిచిన యువకులు ఆయనకు ఫిర్యాదు చేశారు. మార్గమధ్యంలో చిరువ్యాపారులతో సంభాషించారు.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

IMD Rain Alert : అక్కడ వర్షాలు, ఇక్కడ చలి .. ఇక తెలుగు రాష్ట్రాల్లో అల్లకల్లోలమే..!
Coldwave Alert : తెలంగాణా లేక కాశ్మీరా..! ఇక్కడ మరీ సింగిల్ డిజిట్ టెంపరేచరేంటి..! బిఅలర్ట్