జేసీ దివాకర్ రెడ్డితో సీఎం రమేష్, బిటెక్ రవి రహస్య భేటీ: మతలబు?

By telugu teamFirst Published Apr 9, 2020, 9:57 AM IST
Highlights

టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డితో బిజెపి ఎంపీ సిఎం రమేష్, పులివెందుల టీడీపీ ఇంచార్జీ బిటెక్ రవి కలిశారు. జేసీ దివాకర్ రెడ్డి వ్యవసాయ క్షేత్రంలో ఆ రహస్య భేటీ జరిగింది.

అనంతపురం: తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, మాజీ పార్లమెంటు సభ్యుడు జేసీ దివాకర్ రెడ్డితో బిజెపి పార్లమెంటు సభ్యుడు సీఎం రమేష్ రహస్యంగా భేటీ అయ్యారు. టీడీపీ పులివెందుల ఇంచార్జీ, ఎమ్మెల్సీ మారెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి అలియాస్ బిటెక్ రవి కూడా వారితో సమావేశమయ్యారు. 

అనంతపురం జిల్లా పెద్దపప్పూరు మండలం జూటూరు వద్ద ఉన్న జేసీ వ్యవసాయ క్షేత్రంలో ఈ భేటీ జరిగింది. దాదాపు రెండు గంటల పాటు వారు చర్చలు జరిపారు. జేసీని, బిటెక్ రవిని బిజెపిలోకి ఆహ్వానించడానికే సీఎం రమేష్ ఆ భేటీ జరిపి ఉంటారని ఊహాగానాలు చెలరేగుతున్నాయి.

అయితే, తాను రాజకీయాలకు దూరంగా ఉండదలుచుకున్నట్లు జేసి దివాకర్ రెడ్డి గతంలో చెప్పారు. అయితే, తమ భేటీకి రాజకీయ ప్రాధాన్యం లేదని జేసీ దివాకర్ రెడ్డి అన్నారు. పాత స్నేహితులం కాబట్టి కలిశామని ఆయన చెప్పారు. 

తాను వ్యవసాయ క్షేత్రంలో ఉన్నందున కలవడానికి సీఎం రమేష్, బిటెక్ రవి వచ్చినట్లు ఆయన తెలిపారు. వ్యవసాయం గురించి తాము మాట్లాడుకున్నట్లు ఆయన తెలిపారు. అయితే, జేసీ దివాకర్ రెడ్డిని తమ పార్టీలోకి తీసుకోవడానికి బిజెపి నేతలు చాలా కాలంగా ప్రయత్నాలు చేస్తున్నారు. 

click me!