విద్యార్థినులకు ఉచితంగా శానిటరీ నేప్‌కిన్స్‌: వైఎస్ జగన్ కీలక నిర్ణయం

Arun Kumar P   | Asianet News
Published : Mar 05, 2021, 06:17 PM IST
విద్యార్థినులకు ఉచితంగా శానిటరీ నేప్‌కిన్స్‌: వైఎస్ జగన్ కీలక నిర్ణయం

సారాంశం

రాష్ట్రంలోని బాలికలందరి ఆరోగ్యంపై మరింత శ్రద్ధ వహించాలని సంబంధిత అధికారులకు సీఎం జగన్ ఆదేశించారు. 

అమరావతి: ప్రభుత్వ విద్యాసంస్ధల్లో 7వ తరగతి నుంచి  12వ తరగతి వరకు విద్యార్ధినులకు బ్రాండెడ్ కంపెనీలకు చెందిన శానిటరీ నేప్‌కిన్స్‌ను ఉచితంగా పంపిణీ చేయనున్నట్లు ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ శానిటరీ నేప్‌కిన్స్‌ పంపిణీపై క్యాంప్ కార్యాలయంలో సీఎం వైఎస్‌ జగన్‌ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో వైద్య, ఆరోగ్యం, మహిళా, శిశు సంక్షేమశాఖ అధికారులతో ముఖ్యమంత్రి  చర్చించారు. 

బాలికల ఆరోగ్యంపై మరింత శ్రద్ధ వహించాలని సమావేశంలో సీఎం ఆదేశించారు. మార్చి 8 (మహిళా దినోత్సవం రోజున) ఉచిత శానిటరీ నేప్‌కిన్స్‌ పంపిణీ పథకం ప్రారంభించనున్నట్లు తెలిపారు. ఏప్రిల్‌ 15 నాటికి టెండర్ల ప్రక్రియ పూర్తి చేస్తామని  అధికారులు సీఎంకు వివరించారు. ఏప్రిల్‌ నెలాఖరునాటికి  ప్రతిష్టాత్మకమైన కంపెనీలతో సెర్ప్, మెప్మా ఎంఓయూ కుదుర్చుకుంటాయని తెలిపారు. 

రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ స్కూల్స్, జూనియర్‌ కళాశాలలు, గురుకుల పాఠశాలల విద్యార్ధినులకు శానిటరీ నేప్‌కిన్స్‌ పంపిణీ జరుగుతుందన్నారు. జూలై 1 నుంచి ప్రతినెలా ఉచితంగా శానిటరీ నేప్‌కిన్స్‌ పంపిణీ కార్యక్రమం వుంటుందన్నారు. నెలకి 10 చొప్పున ఏడాదికి 120 శానిటరీ నేప్‌కిన్స్‌ పంపిణీ చేయనున్నట్లు...దీనికోసం సుమారు రూ. 41.4 కోట్లు ఖర్చు చేయనున్నట్లు ప్రభుత్వం తెలిపింది.

ఈ సమీక్షా సమావేశంలో సీఎస్‌ ఆదిత్యనాథ్‌ దాస్, ఉన్నత విద్యాశాఖ, స్కిల్‌ డెవలప్‌మెంట్‌ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ సతీష్‌ చంద్ర, పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుడితి రాజశేఖర్, పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ ముఖ్య కార్యదర్శి వై శ్రీలక్ష్మి, మహిళా, శిశు సంక్షేమశాఖ ముఖ్య కార్యదర్శి ఏఆర్‌ అనురాధ, వైద్య, ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి అనిల్‌ కుమార్‌ సింఘాల్, పంచాయితీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, సాంఘిక సంక్షేమశాఖ ముఖ్య కార్యదర్శి కె సునీత, ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ కమిషనర్‌ కాటమనేని భాస్కర్, ఆర్ధికశాఖ కార్యదర్శి కార్తికేయ మిశ్రా, మహిళా, శిశు సంక్షేమశాఖ డైరెక్టర్‌ కృతికా శుక్లా, పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌ వి చినవీరభద్రుడు, సమగ్ర శిక్షా అభియాన్‌ స్టేట్‌ ప్రాజెక్టు డైరెక్టర్‌ వెట్రి సెల్వి, ఏపీఎస్‌సీహెచ్‌ఈ ఛైర్మన్‌ కె హేమచంద్రారెడ్డి,  ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. 

PREV
click me!

Recommended Stories

నాకెప్పుడూ ఇలాంటి ఆలోచన రాలేదు జగన్ కి వచ్చింది అందుకే.. Chandrababu on Jagan | Asianet News Telugu
రైతులందరికీ ఫ్రీగా సోలార్ పెట్టిస్తాం: CM Chandrababu Speech | Solar | Farmers | Asianet News Telugu