ఆర్థిక ఇబ్బందులు ఉన్నా వ్యాట్ తగ్గించాం: చంద్రబాబు

By rajesh yFirst Published 10, Sep 2018, 6:51 PM IST
Highlights

రోజురోజుకు ఆకాశాన్నంటుతున్న పెట్రోల్, డీజిల్ ధరలు ప్రజలకు ఇబ్బందిగా మారడంతో వారికి ఉపశమనం కల్గిస్తూ ఏపీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. కష్టాల్లో ఉన్న ప్రజలను ఆదుకోవాలన్న లక్ష్యంతో పెట్రోల్ డీజిల్ ధరలపై రూ.2 వ్యాట్ తగ్గించింది. అసెంబ్లీలో వ్యాట్ తగ్గిస్తూ సీఎం చంద్రబాబు నాయుడు ప్రకటన చేశారు. కేంద్రప్రభుత్వం కూడా పెట్రో ధరలు తగ్గించాలని అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం చేశారు. 

అమరావతి: రోజురోజుకు ఆకాశాన్నంటుతున్న పెట్రోల్, డీజిల్ ధరలు ప్రజలకు ఇబ్బందిగా మారడంతో వారికి ఉపశమనం కల్గిస్తూ ఏపీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. కష్టాల్లో ఉన్న ప్రజలను ఆదుకోవాలన్న లక్ష్యంతో పెట్రోల్ డీజిల్ ధరలపై రూ.2 వ్యాట్ తగ్గించింది. అసెంబ్లీలో వ్యాట్ తగ్గిస్తూ సీఎం చంద్రబాబు నాయుడు ప్రకటన చేశారు. కేంద్రప్రభుత్వం కూడా పెట్రో ధరలు తగ్గించాలని అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం చేశారు. 

పెట్రోల్, డీజిల్ ధరలపై చెరో 2 రూపాయలు వ్యాట్ తగ్గించడం వల్ల 1120 కోట్ల ఆదాయం తగ్గుతుందని సీఎం చంద్రబాబు తెలిపారు. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నా ప్రజల శ్రేయస్సు కోసం వ్యాట్ తగ్గించినట్లు తెలిపారు. పెట్రోల్ డీజిల్ ధరల పెరుగుదల అన్ని వర్గాలకు భారంగా మారిందని స్పష్టం చేశారు. ఇంధన ధరలు తగ్గించేందుకు నాలుగేళ్లుగా కేంద్రం ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. అంతర్జాతీయ మార్కెట్ ప్రభావం వల్లే ధరల పెరుగుదల అని కేంద్రం మభ్యపెట్టే ప్రయత్నం చేస్తోందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. 

 2014లో ముడి చమురు ధర బ్యారెల్‌కు 105.5 డాలర్లు ఉంటే 2015-16లో 46 డాలర్లకు పడిపోయిందని చంద్రబాబు గుర్తు చేశారు. ప్రస్తుతం ముడి చమురు ధర బ్యారెల్ 72.23 డాలర్లుగా ఉందన్నారు. 2014లో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ. 49.60పైసలు ఉంటే ప్రస్తుతం 86.71పైసలకు పెరిగిందన్నారు. డీజిల్‌ ధర 2014లో రూ.60.98పైసలు ఉంటే, ప్రస్తుతం రూ.79.98పైసలుగా ఉందన్నారు.  

గతంలో క్రూడ్‌ ఆయిల్‌ ధరలు తగ్గినా కేంద్రం ఇంధన ధరలు తగ్గించకుండా అదనపు పన్నులు, సెస్‌ల పేరుతో దోచుకుందని మండిపడ్డారు. ప్రస్తుతం ముడిచమురు ధరలు పెరిగాయన్న నెపంతో పెట్రోల్‌, డీజిల్‌ ధరలను పెంచుతున్నారంటూ అసహనం వ్యక్తం చేశారు. ఇంధన ధరల విషయంలో కేంద్రం నిరంకుశంగా వ్యవహరించడం వల్లే అన్ని వర్గాల ప్రజలు, రాజకీయ పార్టీల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుందన్నారు. 2014 జూన్‌లో డీజిల్‌పై ఎక్సైజ్‌ సుంకం లీటర్‌పై రూ. 3.50 పైసలు ఉంటే,2017 సెప్టెంబర్‌ నాటికి లీటర్‌పై రూ.17.33 పైసలకు పెంచారని అదే పెట్రోల్ విషయానికి వస్తే 2014లో లీటర్‌ పెట్రోల్‌ ధరపై 9.48 పైసలు ఉంటే 2018కి లీటర్‌కు రూ.19.48 పైసలు పెంచారని తెలిపారు. 

ఇవే కాకుండా మౌలిక సదుపాయాల సెస్‌ పేరుతో లీటర్‌ పెట్రోల్‌పై రూ.7, డీజిల్‌పై రూ.8లు అదనపు భారాన్ని వినియోదారులనుంచి వసూలు చేయడం ఎంతవరకు సరైనదని చంద్రబాబు ప్రశ్నించారు. ఒకవైపు వినియోగదారులు పెరుగుతున్న ధరలతో ఇబ్బందులు పడుతుంటే, ప్రభుత్వం సెస్‌ల రూపంలో దోచుకుంటుందన్నారు.

పెట్రోల్‌, డీజిల్‌ ధరల పెంపు ద్వారా గత నాలుగున్నరేళ్లగా కేంద్ర ప్రభుత్వ ఖజానాకు రూ.23లక్షల కోట్లు నిధులు సమకూరితే సామాన్య జనంపై భారం తగ్గించడానికి కేంద్రం చొరవ చూపకపోవడం దుర్మార్గమన్నారు. కేంద్రం చెప్పే మాటలకు, చేసే పనులకు పొంతన లేకుండా పోతోందంటూ చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. 

మరోవైపు చమురు ధరల పెంపుపై కేంద్రం అనుసరిస్తున్న తీరును సీఎం చంద్రబాబు ఖండించారు. గడిచిన నాలుగేళ్లుగా కేంద్ర ప్రభుత్వ చమురు, సంస్థల పెట్రోల్‌, డీజిల్‌ ధరలను అదుపులేకుండా పెంచడం పట్ల దేశవ్యాప్తంగా ఆగ్రహం వెల్లువెత్తుతోందన్నారు. భారత్ బంద్ లో భాగంగా ప్రజల నుంచి వచ్చిన విశేష స్పందనే అందుకు నిదర్శనమన్నారు చంద్రబాబు. 

ఇంధన ధరల విషయంలో కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక, బాధ్యతారహిత విధానాలతో అన్ని వర్గాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. ప్రజలు పడుతున్న ఇబ్బందుల దృష్ట్యా అయినా ధరలను తగ్గించేందుకు కేంద్రం ప్రయత్నించకపోవడం గర్హనీయమన్నారు. దేశవ్యాప్తంగా జరిగిన బంద్ కు టీడీపీ సంఘీభావం ప్రకటించిందని ప్రజల ఆవేదనల్లో పాలు పంచుకుందన్నారు. 

అంతర్జాతీయ మార్కెట్లో పెట్రోలియం ధరలు పెరగడం, రాష్ట్రాల వ్యాట్‌ రేట్లు పెంచడంతో డీజిల్‌, పెట్రోల్‌ ధరలు పెరిగాయని కేంద్ర ప్రభుత్వం ప్రచారం చేస్తోందని ఆరోపించారు. డీజిల్‌, పెట్రోల్‌ ధరలు తగ్గించడంసాధ్యం కాదని పెట్రోలియం శాఖమంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ ఉద్ఘాటించడం సరికాదన్నారు. ఈ ప్రకటన వాస్తవానికి దూరంగాను, ప్రజల్ని మభ్యపెట్టేదిగా ఉందని కేంద్రమంత్రి ప్రకటనను బాధ్యతారాహిత్యమైన ప్రకటనగా పరిగణిస్తూ ఖండిస్తున్నామన్నారు సీఎం చంద్రబాబు.

 

Last Updated 19, Sep 2018, 9:22 AM IST