రాష్ట్రంలో 57 ప్రాజెక్టులు నిర్మిస్తాం: చంద్రబాబు

By rajesh yFirst Published Sep 15, 2018, 5:19 PM IST
Highlights

తెలుగుదేశం ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ లో 57 ప్రాజెక్టులను కచ్చితంగా నిర్మించి తీరుతామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. శ్రీకాకుళం జిల్లాలో పర్యటించిన చంద్రబాబు పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. 

శ్రీకాకుళం: తెలుగుదేశం ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ లో 57 ప్రాజెక్టులను కచ్చితంగా నిర్మించి తీరుతామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. శ్రీకాకుళం జిల్లాలో పర్యటించిన చంద్రబాబు పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. చిన్నసాన ఎత్తిపోతల పథకం శిలాఫలకాన్ని ఆవిష్కరించిన సీఎం ఆ తర్వాత తోటపల్లి పాత ఆయకట్టు కాల్వల ఆధునికీకరణ పనులకు శంకుస్థాపన చేశారు. 

అనంతరం ఎచ్చెర్లలోని అంబేడ్కర్‌ విశ్వవిద్యాలయంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొన్న చంద్రబాబు రాష్ట్రంలో మూడేళ్లుగా తక్కువ వర్షపాతం నమోదవుతుందన్నారు.  ప్రకృతితో ప్రతీ ఒక్కరూ మమేకం కావాలని పిలుపునిచ్చారు. మోక్షగుండం విశ్వేశ్వరయ్య జన్మదినాన్ని ఇంజినీర్ల దినోత్సవంగా నిర్వహిస్తున్నామని ఆయన సేవలను ప్రతీ ఒక్కరు గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. 

సర్ అర్థర్ కాటన్‌ దొర రాష్ట్రంలో మూడు బ్యారేజీలు నిర్మించారని ఆ బ్యారేజీల వల్ల ప్రజల ఆర్థిక స్థితిగతుల్లో పెనుమార్పులు వచ్చాయని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. ప్రాజెక్టులు, సాగునీటి రంగానికి కేఎల్‌రావు, శివరామకృష్ణ రాష్ట్రానికి దిశ, దశ నిర్దేశించారని కొనియాడారు.

శ్రీకాకుళం జిల్లాలో 9లక్షల ఎకరాలకు రెండు పంటలకు నీళ్లిస్తామని హామీ ఇచ్చారు. రాబోయే సీజన్‌ కల్లా రూ.190 కోట్లతో అన్ని పనులు పూర్తి చేస్తామని తెలిపారు. ప్రాజెక్టుల విషయంలో నష్టపోయిన రైతులకు నష్టపరిహారం అందించామని తెలిపారు.

 రాష్ట్రంలో 57 ప్రాజెక్టుల నిర్మాణం చేపడుతున్నామని చంద్రబాబు నాయుడు తెలిపారు. మార్చి నాటికి 27 ప్రాజెక్టులు పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. అలాగే రణస్థలం ప్రభుత్వాసుపత్రిని 50 పడకల ఆసుపత్రిగా మారుస్తానని, జిల్లాకు బీ ఫార్మసీ కళాశాల మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. శ్రీకాకుళం జిల్లాలో సమృద్ధిగా వనరులు ఉన్నాయన్న చంద్రబాబు జిల్లాను బ్రహ్మాండంగా తయారు చేస్తామని ప్రకటించారు.  

click me!