మైలవరం వైసీపీలో కొత్త పంచాయతీ.. స్థానికుడికే టికెట్ ఇవ్వాలంటూ డిమాండ్, ‘‘వసంత’’పై పెరుగుతున్న అసమ్మతి

By Siva KodatiFirst Published Jan 11, 2023, 2:26 PM IST
Highlights

ఎన్టీఆర్ జిల్లా మైలవరం వైసీపీలో కొత్త పంచాయతీ మొదలైంది. ఈసారి అసెంబ్లీ సీటు స్థానిక నేతలకే ఇవ్వాలని మాజీ ఎమ్మెల్యే జ్యేష్ట రమేశ్ బాబు కొత్త డిమాండ్ తెరపైకి తీసుకొచ్చారు. ఇదంతా స్థానిక ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ టార్గెట్‌గానే జరుగుతోందనే ప్రచారం మొదలైంది. 

ఎన్టీఆర్ జిల్లా మైలవరం వైసీపీలో కొత్త పంచాయతీ మొదలైంది. ఈసారి అసెంబ్లీ సీటు స్థానికులకు ఇవ్వాలని డిమాండ్ చేశారు మాజీ ఎమ్మెల్యే జ్యేష్ట రమేశ్ బాబు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చి గెలిచిన వారు నియోజకవర్గంలో కొట్టుకోవడం, తిట్టుకోవడం , దోపిడీలకు పాల్పడటం తప్పించి వారు చేసిందేమీ లేదని పేర్కొన్నారు. ఎన్టీఆర్ జిల్లా జీ.కొండూరులో వైసీపీ నేతలతో భేటీ అయిన ఆయన ‘‘ మన మైలవరం మన నాయకత్వం ’’ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ఇన్‌ఛార్జ్‌ల పాలనను వ్యతిరేకిస్తూ సహజ వనరుల దోపిడీని అరికట్టడమే ధ్యేయమన్నారు. స్థానిక నేతే శాసనసభ్యుడు కావాలని వారు డిమాండ్ చేశారు. ఇప్పటికే మంత్రి జోగి రమేశ్ వర్గం నుంచి అసమ్మతి ఎదుర్కొంటున్నారు సిట్టింగ్ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్.తాజాగా స్థానిక నేతలు కూడా ఆయనను వ్యతిరేకిస్తుండటంతో ఆయన కొత్త సమస్యల్లో పడ్డారు. 

ఇకపోతే..  మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ సొంత పార్టీపై బాహాటంగానే వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇది కూడా వైసీపీ అధినాయకుడికి తలనొప్పి వ్యవహారంలా మారింది. సోమవారం ఆయన తన తండ్రి వసంత నాగేశ్వరరావు టీపీపీ ఎంపీ కేశినేని శ్రీనివాస్ తో భేటి అయ్యారు. ఈ విషయం చర్చనీయాంశంగా మారింది. కొంత కాలం నుంచి కృష్ణ ప్రసాద్ టీడీపీలో చేరుతారనే ప్రచారం సాగుతోంది. ఈ నేపథ్యంలో వీరి భేటీ రాజకీయ ప్రాధాన్యతను సంతరించుకుంది. వైసీపీలో తన కుమారుడికి ప్రియారిటీ ఇవ్వడం లేదనే నాగేశ్వర రావు టీడీపీ ఎంపీతో చర్చలు జరిపారని వార్తలు వెలువడ్డాయి. 

ALso REad: అధికార వైసీపీకి మరో నేత గుడ్ బై.. తెలుగు దేశం పార్టీ ఎంపీతో సమావేశం వెనుక ఉద్దేశం అదేనా ?

అయితే ఈ భేటీపై ఇలా వార్తలు రావడంతో వసంత నాగేశ్వర రావు స్పందించారు. తమ భేటీలో రాజకీయ కోణం లేదని అన్నారు. నాని కూతురు పెళ్లికి హాజరు కాలేకపోయినందుకే సోమవారం వెళ్లి కలిశానని చెప్పారు. తమ గ్రామాన్ని అభివృద్ధి చేయడానికి సంబంధించిన పలు వివరాలు అందించానని, వాటి కోసం నిధులు కేటాయిస్తానని చెప్పారని, దీనికి ఆయన కు ధన్యవాదాలు చెబుతున్నానని అన్నారు. నాగేశ్వర రావు ఇలా వివరణ ఇచ్చినప్పటికీ ఈ భేటీ వెనక రాజకీయ కోణం ఉందని చర్చలు జరుగుతున్నాయి. 

కానీ వసంత కృష్ణ ప్రసాద్ మాత్రం అధికార పార్టీపై బహిరంగంగానే వ్యాఖ్యలు చేస్తుండటం కొనసాగిస్తున్నారు. మంగళవారం కూడా ఆయన పార్టీని విమర్శించారు. తన అసంతృప్తిని వ్యక్తం చేశారు. వైసీపీలోని పలువురు నాయకులపై అసంతృప్తి ఉందని చెప్పారు. తనకు రౌడీలను వెంటేసుకొని తిరగడం చేతకాదని తెలిపారు. అందుకే తాను కిందటి తరం పొలిటీషియన్ గా మిగిలిపోయానని అన్నారు. ఎన్నో ఏళ్లుగా తమ కుటుంబం పాలిటిక్స్ లో ఉందని, కానీ ఇలాంటి పాలిటిక్స్ ఎప్పుడూ చూడలేదని అన్నారు. ప్రస్తుత పాలిటిక్స్ లో అనేక మార్పులు వచ్చాయని అన్నారు. 

click me!