పల్నాడు జిల్లా నరసరావుపేటలో ఆదివారం టీడీపీ - వైసీపీ వర్గీయుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. టీడీపీ నేత చల్లా సుబ్బారావు ఇంటిపై వైసీపీ నేతలు దాడి చేసి.. కిటికీలు, ఫర్నిచర్ ధ్వంసం చేశారు.
పల్నాడు జిల్లా నరసరావుపేటలో ఉద్రిక్తత వాతావరణ నెలకొంది. ఆదివారం టీడీపీ - వైసీపీ వర్గీయుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. రాళ్లు, కర్రలతో ఇరు వర్గాలు కొట్టుకున్నాయి.. సమాచారం అందుకున్న పోలీసులు వీరిని చెదరగొట్టేందుకు ప్రయత్నించారు. విషయం తెలుసుకున్న నరసరావుపేట టీడీపీ ఇన్‌ఛార్జ్ చదలవాడ అరవింద బాబు ఘటనాస్థలి చేరుకున్నారు. అయితే వైసీపీ శ్రేణులు ఆయన కారుపై దాడి చేశాయి. ఈ ఘటనలో అరవిందబాబు కారు డ్రైవర్‌కు గాయాలు అయ్యాయి. మరోవైపు స్థానిక ఎమ్మెల్యే, వైసీపీ నేత గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి కూడా అక్కడికి చేరుకున్నారు.
ఇదిలావుండగా.. టీడీపీ నేత చల్లా సుబ్బారావు ఇంటిపై వైసీపీ నేతలు దాడి చేసి.. కిటికీలు, ఫర్నిచర్ ధ్వంసం చేశారు. శనివారం ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డిపై చల్లా సుబ్బారావు తీవ్ర విమర్శలు చేశారు. ఈ క్రమంలోనే దాడి జరిగినట్లుగా తెలుస్తోంది. ఉద్రిక్త పరిస్ధితుల నేపథ్యంలో పట్టణంలో పోలీసులు భారీగా మోహరించారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది.