
ఏపీలో అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న నేపథ్యంలో జనసేన పార్టీలోకి చేరికలు పెరుగుతున్నాయి. టీడీపీ, వైసీపీలలో చోటు దక్కనివారుతో పాటు పలువురు నేతలకు జనసేన ప్రత్యామ్నాయంగా మారింది. అలాగే పలువురు సెలబ్రెటీలు కూడా జనసేనలో చేరుతున్నారు. తాజాగా స్టార్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ జనసేన పార్టీలో చేరారు. బుధవారం మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేన తీర్ధం పుచ్చుకున్నారు.
కాగా.. నెల్లూరు జిల్లాకు చెందిన జానీ మాస్టర్ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తారనే ప్రచారం జరుగుతోంది. గత కొద్దిరోజులుగా స్వగ్రామంలోనే వుంటున్న ఆయన ప్రజా సమస్యలపై పోరాడుతూనే సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. నెల్లూరు నగరంలోని ఏదో ఒక నియోజకవర్గం నుంచి జానీ మాస్టర్ అసెంబ్లీకి పోటీ చేయాలని భావిస్తున్నట్లుగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో ఆయన జనసేనలో చేరడం ప్రాధాన్యత సంతరించుకుంది.