చింతమనేని ప్రభాకర్ పీఏ, మరో ముగ్గురు టీడీపీ కార్యకర్తలపై వైసీపీ వర్గీయుల దాడి.. ఏలూరులో ఉద్రిక్తత..

By SumaBala BukkaFirst Published Dec 5, 2022, 12:03 PM IST
Highlights

ఏలూరు ప్రభుత్వాసుపత్రి వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. చింతమనేని ప్రభాకర్ పీఏ మీద దాడి చేసిన వైసీపీ వర్గీయులు.. గాయపడిన వారు చేరిన ఆస్పత్రికి రావడంతో అక్కడ మరోసారి దాడులకు దిగారు. 

ఏలూరు : మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ పిఏ, మరో ముగ్గురు టీడీపీ కార్యకర్తల మీద వైసీపీ వర్గీయులు దాడి చేశారు. దీంతో వీరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన ఆదివారం రాత్రి ఏలూరు జిల్లా పెదవేగి మండలం కొప్పాక సమీపంలో చోటు చేసుకుంది. ఈ ఘటనకు సంబంధించి బాధితులు, పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ పిఏ  శివబాబు, మరి కొంతమందితో కలిసి ఓ వ్యక్తిని కలిసేందుకు పెదకడిమి గ్రామంలోని రాజా తోటకు జీపులో వెళ్తున్నారు. మార్గమధ్యంలో అలుగులగూడెం వంతెన దగ్గర వైసిపి వర్గీయులు వీరి బండిని అడ్డుకున్నారు,

ఎక్కడికి వెళ్తున్నారు అంటూ ప్రశ్నించారు. ఆ తరువాత కర్రలు,  రాడ్లతో దాడికి దిగారు. ఈ దాడిలో శివబాబుతో పాటు.. అతనితో వెడుతున్న మరో ముగ్గురికి తీవ్ర గాయాలు అయ్యాయి. దాడి విషయం గమనించిన స్థానికులు గాయపడిన వారిని ఏలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ దాడిలో శివబాబు తలకు తీవ్ర గాయాలు అయ్యాయి. దీంతో మెరుగైన చికిత్స కోసం అతడిని నగరంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో అతడిని చేర్చారు. తన మీద దాడి ఎందుకు జరిగిందో శివబాబు ఇలా చెప్పుకొచ్చారు..

కర్నూలులో రాయలసీమ గర్జన సభ.. భారీగా తరలివస్తున్న జనం..

కొప్పాక సమీపంలోని పోలవరం కుడికాలువ దగ్గర వైసీపీకి చెందిన కొందరు జెసిబిలతో మట్టి తగ్గిస్తున్నారు. అదే సమయంలో తాము అటువైపుగా వెళుతుండడంతో.. వారిని అడ్డుకునేందుకే వెళ్తున్నామని అనుకున్నారని.. అందుకే తమపై దాడి చేశారని చెప్పారు. వైసీపీకి చెందిన కొప్పాక రంగారావు,  పచ్చిపులుసు శివ సహా మరికొంతమంది తమపై దాడి చేసిన వారిలో ఉన్నారని ఆరోపించారు. చింతమనేని సతీమణి రాధా బాధితులను పరామర్శించారు.

టిడిపి వర్గీయులపై వైసిపి వర్గీయులు దాడి చేయడంతో ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రి వద్ద ఉద్రిక్తత నెలకొంది. దాడిలో గాయపడిన శివ బాబు, మిగతా ముగ్గురు ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ సమయంలోనే దాడి చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న పచ్చిపులుసు శివ, కొప్పాక రంగారావు సహా మరికొంతమంది ఆస్పత్రికి వచ్చారు.  వైద్య అవసరాల కోసం వారు అక్కడికి వచ్చారు. అక్కడ రెండు వర్గాల వారు ఒకరిపై ఒకరు దాడులకు పాల్పడడంతో ఆస్పత్రి వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పోలీసులకు విషయం తెలియడంతో.. వారు హుటాహుటిన ఆసుపత్రి వద్దకు చేరుకున్నారు. 

click me!