తిరుపతిలో బాల్య వివాహం కలకలం.. ఎస్వీ వేదిక్ యూనివర్సిటీ రిజిస్ట్రార్‌పై కేసు నమోదు..

By Sumanth KanukulaFirst Published May 28, 2022, 10:17 AM IST
Highlights

తిరుపతిలో బాల్య వివాహం కలకలం రేపింది. కొడుకుకు బాల్య వివాహం జరిపించిన ఘటనలో తిరుపతిలోని ఎస్వీ వేదిక్‌ యూనివర్సిటీ రిజిస్ట్రార్ రాధే శ్యామ్, అతని భార్య శ్రీదేవిపై పోలీసులు కేసు నమోదు చేశారు. 

తిరుపతిలో బాల్య వివాహం కలకలం రేపింది. కొడుకుకు బాల్య వివాహం జరిపించిన ఘటనలో తిరుపతిలోని ఎస్వీ వేదిక్‌ యూనివర్సిటీ రిజిస్ట్రార్ రాధే శ్యామ్, అతని భార్య శ్రీదేవిపై పోలీసులు కేసు నమోదు చేశారు. వారి మైనర్ కుమారుడికి మైనర్ బాలికతో వివాహం జరిపించిన ఆరోపణలపై బాల్య వివాహాల నిషేధ (సవరణ) చట్టం, 2016 కింద తిరుపతిలోని అలిపిరి డివిజన్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఇదే కేసులో మైనర్ బాలిక తల్లిదండ్రులు వెంకటేశ్వర్లు, శ్రావణి కుమారిలపై కూడా పోలీసులు కేసులు నమోదు చేశారు.

గుంటూరు జిల్లాకు చెందిన రాధే శ్యామ్ తిరుపతిలోని ఎస్వీ వేదిక్‌ విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్‌గా పనిచేస్తున్నారు. కుటుంబంతో కలిసి ఖాదీకాలనీలోని శాంతినగర్‌లో నివాసం ఉంటున్నారు. తిరుపతికి చెందిన వెంకటేశ్వర్లు, శ్రావణికుమారి ఆర్‌ఎస్‌ గార్డెన్‌లో ఉంటున్నారు. ఈ రెండు కుటుంబాలు తమ పిల్లలకు చిన్నవయసులోనే వివాహం జరిపించాయి. 

అలిపిరి పోలీస్ ఇన్‌స్పెక్టర్ అబ్బన్న మాట్లాడుతూ.. రాధే శ్యామ్ తన 17 ఏళ్ల కొడుకు పెళ్లిని 11 ఏళ్ల బాలికతో తిరుపతిలో జరిపించాడని చెప్పారు. వివాహ వేదికను ఇంకా గుర్తించలేదని ఆయన తెలిపారు. వివాహం పురాతన సంప్రదాయాల ప్రకారం నిర్వహించబడిందని చెప్పారు. బాలల హక్కుల కార్యకర్తలు చేసిన ఫిర్యాదు మేరకు పోలీసులు చర్యలు తీసుకున్నట్టుగా వెల్లడించారు. పెళ్లి జరిగిన ఫోటోలలను కూడా బాలల హకకుల కార్యకర్తలు ఫిర్యాదు కూడా జత చేసినట్టుగా వెల్లడించారు. అవి బాల్య వివాహం జరిగినట్టుగా రుజువు చేస్తున్నాయని తెలిపారు. 

పురాతన సంప్రదాయాల ప్రకారం ఐదు రోజుల పాటు వివాహం చేశారని ఫిర్యాదుదారులు ఆరోపించారని ఆయన చెప్పారు. ఈ ఫిర్యాదు ఆధారంగా రిజిస్ట్రార్‌, అతని భార్య, మైనర్‌ బాలిక తల్లిదండ్రులపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశామని తెలిపారు. ఇందుకు సంబంధించి ఇప్పటివరకు ఎవరినీ అరెస్టు చేయలేదని పోలీసులు తెలిపారు. కేసు దర్యాప్తు చేస్తున్నామని.. అరెస్టులకు అదనపు ఆధారాలు సేకరించే పనిలో ఉన్నామని చెప్పారు. 

మరోవైపు రాధే శ్యామ్, అతని బంధువులు మాత్రం తాము జరుపుకున్నది వివాహ వేడుక కాదని.. పురాతన సంప్రదాయాల ప్రకారం మతపరమైన కార్యక్రమం అని చెబుతున్నారు. అయితే ఉన్నత విద్యావంతులు ఉన్న కుటుంబంలో బాల్య వివాహం జరగడం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. 

click me!