చికెన్ ప్రియులకు షాక్.. శ్రావణమాసంలోనూ పెరిగిన ధరలు.. కేజీ ఎంతంటే...

By Bukka SumabalaFirst Published Aug 11, 2022, 9:00 AM IST
Highlights

పండగల సీజన్ లో ఎప్పుడూ తగ్గే చికెన్ ధరలు ఈ సారి పెరిగిపోయాయి. డిమాండుకు తగ్గ సప్లై లేకపోవడంతో చికెన్ ధర కొంచెక్కి కూర్చుంది. 

కోనసీమ : శ్రావణమాసం లోనూ చికెన్ ధరలు దిగి రావడం లేదు. కేజి 300 రూపాయలకు చేరి వినియోగదారులకు చుక్కలు చూపిస్తోంది. కోళ్ల మేత ధరలు పెరగడంతో.. కొత్త బ్యాచ్ లు వేసేందుకు  కోళ్ల రైతులు విముఖత చూపిస్తున్నారు. స్థానికంగా చాలా తక్కువ కోళ్లు అందుబాటులో ఉండడంతో తెలంగాణతో పాటు.. జంగారెడ్డిగూడెం తదితర ప్రాంతాల నుంచి కోళ్లను దిగుమతి చేసుకోవాల్సి వస్తుంది. ఈ ఫలితంగా చికెన్ ధరలకు రెక్కలు వచ్చాయని వ్యాపారులు చెబుతున్నారు. 

రోజుకు 3.2 లక్షల కిలోలు..
తూర్పుగోదావరి, కోనసీమ, కాకినాడ జిల్లాల్లో రోజుకు సాధారణంగా 3.2 లక్షల కిలోల చికెన్ వినియోగిస్తున్నారు. ఆదివారం, పండగ రోజుల్లో ఈ వినియోగం రెట్టింపు స్థాయిలో ఉండడంతో అమ్మకాలు విపరీతంగా ఉంటాయి. ఆయా జిల్లాల్లోని రాజానగరం, ఆలమూరు, కోరుకొండ,  గోకవరం, అమలాపురం, రావులపాలెం, తుని, తొండంగి, కొవ్వూరు, తదితర  ప్రాంతాల్లో 440 కోళ్ల ఫారంలు విస్తరించి ఉండగా ఏడు లక్షల కోళ్ళు పెంపకం జరుగుతున్నట్లుగా అంచనా.  బ్యాచ్ వేసిన 40 రోజుల్లో రెండు నుంచి రెండున్నర కేజీల వరకు పెరిగి బ్రాయిలర్ కోళ్లు వినియోగానికి వస్తాయి.

నాకు ఇంకో పెళ్లయ్యిందట.. సంతోష్ అనే కొడుకున్నాడట, మా ఇంట్లో విషాదాన్నీ వదల్లేదు : వైసీపీపై నారా లోకేష్

పండగలు, పెళ్లిళ్ల సీజన్ ను బట్టి రైతులు ఎప్పటికప్పుడు కొత్త బ్యాచ్ లు వేస్తుంటారు. మిగిలిన నెలలతో పోలిస్తే వరలక్ష్మి వ్రతం, వినాయక చవితి వేడుకలు, దేవీ నవరాత్రి ఉత్సవాలు, అయ్యప్ప మాల ధారణ, కార్తీక మాసం పూజల నేపథ్యంలో.. శ్రావణ మాసం నుండి కార్తీకమాసం ముగిసేవరకూ చికెన్ వినియోగం గణనీయంగా తగ్గుతుంది. ఈ నేపథ్యంలో ఆగస్టు నుంచి డిసెంబర్ వరకు అన్ సీజన్ గా భావించి కొత్త బ్యాచ్ లు వేయడాన్ని తగ్గించడం మామూలే.

ఇతర ప్రాంతాల నుంచి దిగుమతి,,,
కోళ్లకు ఆహారంగా అందించే మొక్కజొన్న, సోయా తదితర మేత ధరలు కొద్ది నెలలుగా దిగి రావడం లేదు. అన్ని మేతలు మిక్స్ చేసి అమ్మే కంపెనీ మేత కిలో రూ.30 నుంచి రూ.50కి పెరిగిపోయినట్లు కోళ్ల రైతులు అంటున్నారు. కిలో కోడి తయారయ్యేందుకు రెండు కిలోల మేత అవసరమవుతుంది. ఇతర నిర్వహణ ఖర్చులతో లైవ్ కిలో కోడికి రూ.110  వరకు ఖర్చు అవుతుందని అంటున్నారు. పెరిగిన ధరలతో సొంతంగా నిర్వహణ చేయలేక అధికశాతం మంది కోళ్ల రైతులు కమిషన్పై కోడి పిల్లలను పెంచి పెద్ద చేసి అప్పగించేందుకు బ్రాయిలర్ కంపెనీలతో ఒప్పందాలు చేసుకుంటున్నారు.

అయితే కంపెనీలు ఇస్తున్న కమిషన్ సరిపోవడం లేదంటూ ఇటీవల సమ్మె చేయడం కొత్త  బ్యాచ్ లపై కొంత ప్రభావం పడిందని అంటున్నారు. స్థానికంగా కోళ్ల పెంపకం తగ్గడంతో పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం, తెలంగాణలోని ఖమ్మం, అశ్వరావుపేట, తదితర ప్రాంతాల నుంచి వ్యాపారులు కోళ్లను దిగుమతి చేసుకుంటున్నారు.  ఆయా కారణాలతో  శ్రావణమాసం అయినప్పటికీ ధరకు మళ్లీ రెక్కలొచ్చాయి. బుధవారం స్కిన్లెస్ కిలో రూ.300కి చేరగా,  లైవ్ కిలో రూ.160  వరకు పెరిగింది.  ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా ఈ ధర మరింత పెరిగే అవకాశముందని వ్యాపారులు అంటున్నారు.

click me!