
అమరావతి: అలిపిరి నడక మార్గానికి సంబంధించి తిరుమల తిరుపతి దేవస్థానం కీలక నిర్ణయాలు తీసుకుంది. ఈ నడక మార్గంలో వెళ్లుతుండగా ఓ బాలుడిపై చిరుత దాడి చేసిన సందర్భంలో ఈ సమీక్ష చేసింది. చిరుత దాడి చేసిన ప్రాంతానికి తితిదే ఈవో ధర్మారెడ్డి వెళ్లారు. శుక్రవారం ఆ ప్రాంతాన్ని పరిశీలించారు. ఆ బాలుడిపై పిల్ల చిరుత దాడి చేసిందని, అందుకే బాలుడికి ప్రాణాపాయం తప్పిందని వివరించారు. చిరుత దాడి సమయంలో ఇతర భక్తులు అరవడం, రిపీటర్ స్టేషన్ నుంచి లైట్లు వేయడంతో ప్రమాదం తప్పిందని అన్నారు. భయంతో ఆ చిరుత బాలుడిని వదిలి వెళ్లిపోయిందని తెలిపారు.
ఈ ప్రాంతంలో చిరుత సంచారాన్ని తితితే అటవీ శాఖ అధికారులు గుర్తించారని వివరించారు. అందుకే రాత్రి 7 గంటలు దాటిన తర్వాత నడక మార్గంలో గాలిగోపురం నుంచి ఏకకాలంలో 200 మంది భక్తులను గుంపుగా పంపించేలా ఏర్పాట్లు చేశామని చెప్పారు. ఈ బృందం వెంటే సెక్యూరిటీ గార్డు ఉంటాడని, పిల్లలను గుంపు మధ్యలో ఉండేలా చేసుకోవాలని తెలిపారు.
Also Read: కాంగ్రెస్‌లో వైఎస్సార్టీపీ విలీనంపై షర్మిలా రియాక్షన్ ఇదే.. ఆమె ఏమన్నారంటే?
ఈ చిరుతను పట్టుకునే ప్రయత్నం కూడా చేసినట్టు ఆయన వివరించారు. కెమెరా ట్రాప్స్ కూడా సిద్ధం చేశారని చెప్పారు. చిరుతను పట్టుకునే ఏర్పాట్లు చేశామని చెప్పారు. శ్రీవారి మెట్టుమార్గంలో సాయంత్రం 6 గంటల వరకు, అదే అలిపిరి నడక మార్గంలో అయితే రాత్రి 10 గంటల వరకు మాత్రమే భక్తులను అనుమతించాలనే నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించారు. అలాగే, సాయంత్రం 6 గంటల తర్వాత ఘాట్ రోడ్‌లపై వెళ్లే బైక్ చోదకుల భద్రత కోసం చర్యలు తీసుకోవడంపై ఆలోచనలు చేస్తున్నట్టు వివరించారు.
చిరుత దాడి వంటి ఘటనలు పునరావృతం కాకుండా వన్య ప్రాణులకూ ఇబ్బంది లేకుండా కంచె ఏర్పాటు చేసే ఆలోచనలూ చేస్తున్నామని, ఒక వేళ అది నిబంధనలకు విరుద్ధంగా ఉంటే ఆ దారి గుండా భక్తులను రాత్రి పూట అనుమతించడంపై పునరాలోచన చేస్తామని వివరించారు.