కరోనా నేఫథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విధించిన కర్ఫ్యూ సడలింపుల్లో ఏపీ సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వం మార్పులు చేసింది. ఉభయ గోదావరి జిల్లాల్లో మాత్రం ఉదయం 6 నుంచి సాయంత్రం 7 వరకు కర్ఫ్యూ ఉంటుంది.
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కర్ఫ్యూ సడలింపుల్లో మార్పులు చేస్తూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఉభయ గోదావరి జిల్లాల్లో ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు కర్ఫ్యూను సడలిస్తారు. దుకాణాలు సాయంత్రం 6 గంటలకే మూసేయాల్సి ఉంటుంది. కరోనా పాజిటివిటీ రేటు 5 శాతానికి లోపు నమోదయ్యే వరకు ఈ కర్ఫ్యూ కొనసాగుతుంది.
ఆ రెండు జిల్లాల్లో మినహా అన్ని జిల్లాల్లో కర్ఫ్యూ సడలింపు ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకుకర్ఫ్యూ సడలిస్తారు. థియేటర్లు నడుపుకునేందుకు కూడా జగన్ ప్రభుత్వం అనుమతించింది. కోవిడ్ నిబంధనలను పాటించాలని సూచించింది. శానిటైజర్, మాస్కులు వాడాలని, సీటుకు సీటుకు మధ్య ఖాళీ ఉంచాలని సూచించింది.
ఏపీలో జిమ్ సెంటర్లకు, ఫంక్షన్ హాల్స్ కు కూడా జగన్ ప్రభుత్వం అనుమతించింది. ఇవి యాభై శాతం హాజరుతో నడవాలని సూచించింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జారీ చేసిన తాజా ఆదేశాల ప్రకారం కర్ఫ్యూ సడలింపులు ఈ నెల 8వ తేదీ నుంచి అమలులోకి రానున్నాయి. రాష్ట్రంలోని 11 జిల్లాల్లో ఈ సడలింపులు ఉంటాయి. కరోనా నేపథ్యంలో ప్రభుత్వం కర్ఫ్యూను అమలు చేస్తున్న విషయం తెలిసిందే.