అమరావతి ప్రాంతంలో అసైన్డ్ భూములు కొన్నా: బ్రహ్మానంద రెడ్డి ఒప్పుకోలు

By telugu teamFirst Published Jul 5, 2021, 12:51 PM IST
Highlights

ఏపీ రాజధాని అమరావతి ప్రాంతంలో తాను అసైన్డ్ భూములను కొనుగోలు చేసినట్లు బ్రహ్మానంద రెెడ్డి అంగీకరించారు. అప్పటి చంద్రబాబు ప్రభుత్వం అందుకు అనుమతించిందని, అందుకే కొన్నానని ఆయన చెప్పారు.

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంతంలో తాను అసైన్డ్ భూములు కొనుగోలు చేసినట్లు బ్రహ్మానంద రెడ్డి అంగీకరించారు. దళితుల భూములను లాక్కోవడానికి బ్రహ్మానంద రెడ్డికి ఉన్న హక్కు ఏమిటని మంగళగిరి వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి ప్రశ్నిస్తూ ఆయనను అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. 

ఆళ్ల రామకృష్ణా రెడ్డి చేసిన ఆరోపణలకు బ్రహ్మానంద రెడ్డి సమాధానం ఇచ్చారు. అమరావతి ప్రాంతంలో తాను దాదాపు 50 ఎకరాల భూములు కొనుగోలు చేసినట్లు చెప్పారు. రైతులు విక్రయించడానికి స్వచ్ఛందంగా ముందుకు వచ్చారని, అందుకే తాను కొనుగోలు చేశానని ఆయన చెప్పారు. అప్పటి ప్రభుత్వం అసెన్డ్ భూములను కొనుక్కునే వెసులుబాటును కల్పించిందని ఆయన చెప్పారు.

అయితే తనకు తెలుగుదేశం పార్టీ (టీడీపీ) నేతలతో సంబంధాలు లేవని ఆయన స్పష్టం చేశారు. అవసమైతే తన ఫోన్ చెక్ చేసుకోవచ్చునని ఆయన చెప్పారు. రైతులు ముందుకు వచ్చి అమ్మితేనే తాను కొన్నానని ఆయన చెప్పారు. 

అమరావతి ప్రాంతంలో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు రియల్ ఎస్టేట్ వ్యాపారులను ప్రోత్సహించారని, అమరావతి భూముల విషయంలో అక్రమాలు జరిగినట్లు రుజువులు ఉన్నాయని ఆళ్ల రామకృష్ణా రెడ్డి అన్నారు ఇందుకు సంబంధించి ఆయన ఓ వీడియోను కూడా విడుదల చేశారు. 

అసైన్డ్ భూములను రియల్ ఎస్టేట్ వ్యాపారులకు ఇచ్చారు, దళితుల అసైన్డ్ భూములను రియల్ ఎస్టేట్ వ్యాపారులు కొనుగోలు చేశారని ఆయన ఆరోపించారు. భూములు రియల్ ఎస్టేట్ వ్యాపారుల చేతుల్లోకి వెళ్లిన తర్వాత చంద్రబాబు ప్యాకేజీ ప్రకటించారని ఆయన చెప్పారు.  

click me!