
ఇటీవల మావోయిస్టుల కాల్పుల్లో మరణించిన అరకు ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ కిడారి సర్వేశ్వరరావు పెద్ద కుమారుడు శ్రావణ్‌కుమార్‌కు మంత్రి పదవి ఇవ్వనున్నారా..? అవుననే సమాధానమే ఎక్కువగా వినపడుతోంది. త్వరలో ఏపీ మంత్రి వర్గ విస్తరణ ఉంది. కాగా.. ఆ సమయంలో శ్రవణ్ కి మంత్రి వర్గంలో చోటు కల్పించాలని సీఎం చంద్రబాబు భావిస్తున్నట్లు సమాచారం.
ఐఐటీ నుంచి ఇంజనీరింగ్ చదివిన శ్రావణ్‌కుమార్‌ను మంత్రివర్గంలోకి తీసుకుని కీలక శాఖ అప్పగిస్తే, ప్రజల్లోకి.. ప్రత్యేకించి గిరిజనుల్లోకి మంచి సంకేతాలు వెళతాయని ఆయన ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది.గిరిజనులకు మంత్రివర్గంలో అవకాశమివ్వలేదనే విమర్శ తొలగిపోవటంతోపాటు రాజకీయంగానూ సానుకూలత ఏర్పడుతుందని తెదేపా వర్గాల అంచనా.
గతంలో భూమా నాగిరెడ్డిని మంత్రివర్గంలోకి తీసుకోవాలని భావించగా, ఆయన ఆకస్మికంగా మరణించారు. దీంతో నాగిరెడ్డి కుమార్తె అఖిలప్రియకు అవకాశం కల్పించారు. రాయలసీమలో పార్టీకి అదొక సానుకూల పరిణామంగా అప్పట్లో పరిగణన పొందింది. ఇప్పుడు శ్రావణ్‌కుమార్‌కు కూడా మంత్రివర్గంలో అవకాశమిస్తే గిరిజన వర్గాల నుంచి ఆదరణ లభిస్తుందని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. రానున్న ఎన్నికల్లో అరకు సీటు కూడా శ్రవణ్ కే కేటాయించాలని అనుకుంటున్నారట. ఆలోపే అతనికి మంత్రి పదవి కట్టబెట్టాలని అనుకుంటున్నట్లు సమాచారం. అయితే .. ఇందులో వాస్తవమెంత ఉందో తెలియాలంటే మాత్రం అధికార ప్రకటన వెలువడే వరకు ఆగాల్సిందే.