చంద్రబాబు విశాఖ పర్యటనకు విమానయానం దెబ్బ

By telugu teamFirst Published May 25, 2020, 6:20 AM IST
Highlights

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడి విశాఖపట్నం పర్యటన వాయిదా వడింది. విశాఖపట్నానికి విమానాలు రద్దు కావడంతో చంద్రబాబు విశాఖకు వెళ్లలేని స్థితి ఏర్పడింది. ఆయన అమరావతికి రోడ్డు మార్గంలో వెళ్తారు.

అమరావతి: తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడి విశాఖపట్నం పర్యటన వాయిదా పడినట్లే. సోమవారం చంద్రబాబు ఉదయం 9 గంటలకు చంద్రబాబు హైదరాబాదు నుంచి విశాఖపట్నం వెళ్లాల్సి ఉండింది. విశాఖలో ఎల్జీ పాలీమర్స్ బాధితులను పరామర్శించి ఆ తర్వాత రోడ్డు మార్గంలో అమరావతిలోని తన నివాసానికి చేరుకునేలా కార్యక్రమం ఖరారైంది. 

అయితే, విశాఖ నుండి సోమవారం ప్రారంభం కావాల్సిన విమానాల రాకపోకలు తాత్కాలికంగా రద్దయ్యాయి. సోమవారం ఉదయం నుండి నాలుగు ప్రాంతాలకు రాకపోకలు సాగించేందుకు దేశీయ విమానాల షెడ్యూల్ ను అధికారులు ప్రకటించారు. అయితే ఆఖరి నిముషంలో సాంకేతిక కారణాలతో విమానాల రాకపోకలు రద్దు చేశారు. సోమావరం ఉదయం చంద్రబాబు రావాల్సిన విమానం కూడా రద్దయింది. 

విశాఖపట్నం విమానాశ్రయంలో సోమవారం ఎటువంటి ఫ్లైట్స్ ల్యాండ్ అవడానికి లేదని విమానాశ్రయం అధికారులు చెప్పారు. దీంతో చంద్రబాబు షెడ్యూల్ మారింది. సోమవారం హైద్రాబాద్ నుండి రోడ్డు మార్గంలో చంద్రబాబు, ఆయన కుమారుడు నారా లోకేష్ అమరావతి కి వచ్చే అవకాశం ఉంది.

ఇదిలావుండగా, సోమవారం విశాఖపట్నం పర్యటనకు అనుమతి ఇచ్చినట్లే ఇచ్చి, విమాన సర్వీసులను నిలిపేయడం వైసిపి ప్రభుత్వ కుట్రగా టిడిఎల్ పి ఉపనేత అచ్చెన్నాయడు ధ్వజమెత్తారు. సోమవారం ఒక్కరోజే ఏపికి విమాన సర్వీసుల బంద్  చేయడం వైసిపి కుట్రలో భాగమేని,  ఒక్కరోజే విశాఖ, విజయవాడ ఎయిర్ పోర్టుల మూత వేయడం, మళ్లీ మంగళవారం సర్వీసులు ఉన్నాయని చెప్పడం దీనికి బలం చేకూరుస్తోందని ఆయన అన్నారు. 

చంద్రబాబు షెడ్యూల్ ప్రకటించాకే ఏపికి విమాన సర్వీసుల బంద్ చేశారని, ఏపి ఎయిర్ పోర్టుల మూతకు నిర్ణయం తీసుకున్నారని,  కేంద్ర విమానయాన శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురి ట్వీట్ దీనికి ప్రత్యక్ష రుజువు అని ఆయన అన్నారు. ఏపి ప్రభుత్వ అభ్యర్దన మేరకే సర్వీసులు రద్దు చేశామని హర్దీప్ సింగ్ పురి ట్వీట్ చేశారని, 26వ తేదీకే ఏపికి పరిమిత సర్వీసులని కేంద్రమంత్రి చెప్పారని ఆయన అన్నారు. 

తమిళనాడులో చెన్నైకి గరిష్టంగా 25సర్వీసులు నడుపుతున్నట్లు, దేశంలో ఇతర ఎయిర్ పోర్టుల తరహాలోనే తమిళనాడులో ఇతర ఎయిర్ పోర్టులకు సర్వీసులు ఉంటాయని హర్దీప్ సింగ్ పురి ఆ ట్వీట్ లో పేర్కొన్నారని ఆయన గుర్తు చేశారు. చంద్రబాబు విశాఖ ఎప్పుడు వచ్చినా వైసిపికి భూకంపం వచ్చినట్లు ప్రవర్తిస్తోందని అన్నారు. చంద్రబాబు అంటే వైసిపి నాయకుల్లో ఉన్న భయాన్ని ఈ విధమైన చేష్టలు రుజువు చేస్తున్నాయని అన్నారు. 

ఈ రోజు విశాఖ వెళ్లకుండా ఆపగలిగినా విశాఖ వాసుల మనుసుల్లో నుంచి చంద్రబాబును, తెలుగుదేశం పార్టీని చెరిపేయడం వైసిపి నాయకులకు అసాధ్యం అనేది గుర్తుంచుకోవాలని అన్నారు. విశాఖ అభివృద్దికి టిడిపి ప్రభుత్వ చేసిన అవిరళ కృషే అక్కడి ప్రజల్లో చంద్రబాబు పట్ల, తెలుగుదేశం పట్ల చిరస్థాయిలో ముద్ర పడిందని అన్నారు. అతి త్వరలోనే ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీకేజి  బాధిత కుటుంబాలను చంద్రబాబు పరామర్శిస్తారని అచ్చెన్నాయుడు చెప్పారు.

click me!