ఎల్జీ పాలిమర్స్ దుర్ఘటన: వైఎస్ జగన్ ప్రకటనపై చంద్రబాబు అసంతృప్తి

By telugu team  |  First Published May 8, 2020, 1:49 PM IST

విశాఖపట్నంలోని ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీకేజీ దుర్ఘటనపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చేసిన ప్రకటనపై టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రభుత్వ స్పందన బాధాకరంగా ఉందని అన్నారు.


హైదరాబాద్: విశాఖపట్నంలోని ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీక్ ఘటనపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చేసిన ప్రకటనపై ప్రతిపక్ష నేత, తెలుగుదేశం పార్టీ (టీడీపీ) అధ్యక్షుడు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. దుర్ఘటనను తేలిగ్గా తీసుకునే విధంగా జగన్ ప్రకటన ఉందని ఆయన శుక్రవారం హైదరాబాదులో మీడియా సమావేశంలో విమర్శించారు. ప్రభుత్వ స్పందన బాధాకరంగా ఉందని అన్నారు. ఫ్యాక్టరీ తరలింపుపై ఆలోచన చేస్తామని జగన్ అనడం సరి కాదని ఆయన అన్నారు.తానైతే నేరుగా ఫ్యాక్టరీకే వెళ్లేవాడినని ఆయన చెప్పారు. తాను రాజకీయం చేయడం లేదని అన్నారు. ప్రభుత్వం చాలా విషయాలను ఓవర్ లుక్ చేస్తోందని ఆయన అన్నారు. 

విశాఖ దుర్ఘటన కలచివేసిందని ఆయన అన్నారు. ఐఏఎస్ అధికారుల కమిటీ ఏం చేస్తోందని, నిపుణుల కమిటీ వేయాల్సి ఉంటుందని ఆయన అన్నారు. విశాఖ దుర్ఘటన విషయంలో ప్రభుత్వం తప్పిదాలు చాలా ఉన్నాయని ఆయన అన్నారు తాము పార్టీ తరఫున ఓ కమిటీ వేసినట్లు తెలిపారు. కోటి రూపాయల పరిహారం మనుషులను బతికిస్తుందా అని ఆయన ప్రశ్నించారు.

Latest Videos

undefined

ఎల్జీ పాలిమర్స్ దుర్ఘటనలో 12 మంది మరణించారని, ప్రజలు భయబ్రాంతులకు గురయ్యారని, అటువంటి ఘటనపై కేంద్రాన్ని, ప్రపంచంలోని నిపుణులను సంప్రదించే అధికారం ముఖ్యమంత్రికి ఉందని ఆయన అన్నారు. విశాఖకు వెళ్లడానికి తాను కేంద్రం అనుమతి కోరానని, కేంద్రం అనుమతి వచ్చిన వెంటనే వెళ్తానని ఆయన చెప్పారు.  

ఎల్జీ పాలిమర్స్ మీద చర్యలు తీసుకునే విషయంలో మొహమాటం అక్కరలేదని చంద్రబాబు అన్నారు. పరిశ్రమను అక్కడి నుంచి తరలించడానికి చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు. ప్రజల ప్రాణాలు, ఆరోగ్యం అన్నింటికన్నా ముఖ్యమని ఆయన అన్నారు. ఇది సాధారణమైన ప్రమాదం కాదని, పరిశ్రమలో పనిచేసేవారు మరణించడం జరుగుతూ ఉంటుందని, కానీ తొలిసారి పరిశ్రమ వెలుపలి ప్రజలు మరణించారని ఆయన అన్నారు. విశాఖపట్నం మొత్తం భయబ్రాంతులకు గురయ్యారని ఆయన చెప్పారు 

ఆయా రంగాల్లోని నిపుణులు మాత్రమే ఘటనపై దర్యాప్తు చేయాలని, ప్రమాద ఘటనపై పూర్తి స్థాయి విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. పరిశ్రమ యాజమాన్యంపై సాధారణ కేసులను మాత్రమే పెట్టారని చెబుతూ ఏ సెక్షన్ల కింద కేసులు పెట్టారో చంద్రబాబు తెలియజేశారు. 

ప్రమాదం జరిగిన తర్వాత పరిశ్రమలో సైరన్ కూడా మోగలేదని ఆయన అన్నారు. మానవ తప్పిదమా, సాంకేతిక సమస్యనా అనేది తేలాల్సి ఉందని ఆయన అన్నారు. బాధితులకు ఆయన సానుభూతి తెలియజేశారు. మృతులకు చంద్రబాబు సంతాపం ప్రకటించారు. తదుపరి ప్రజలకు వచ్చే ఆరోగ్య సమస్యలపై కూడా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుందని ఆయన అన్నారు.

click me!