నిమ్మగడ్డ కేసులో సుప్రీం తీర్పు...ఈ ఎదురుదెబ్బలకు కారణమదే: చంద్రబాబు

By Arun Kumar PFirst Published Jul 24, 2020, 9:23 PM IST
Highlights

నిమ్మగడ్డ రమేష్ కుమార్ వ్యవహారంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై టిడిపి అధ్యక్షులు చంద్రబాబు నాయుడు స్పందించారు. 

గుంటూరు: నిమ్మగడ్డ రమేష్ కుమార్ దాఖలు చేసిన కోర్టు ధిక్కరణ  పిటిషన్ పై హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై స్టే ఇవ్వాలని సుప్రీం కోర్టును ఆశ్రయించిన ఏపీ ప్రభుత్వానికి చుక్కెదురయ్యింది. ఈ పిటిషన్ పై విచారణ జరిపిన అత్యున్నత న్యాయస్థానం ఏపీ ప్రభుత్వం కోరినట్లు స్టే ఇచ్చేందుకు నిరాకరించిన విషయం తెలిసిందే. ఈ తీర్పుపై టిడిపి అధ్యక్షులు చంద్రబాబు నాయుడు స్పందించారు. 

''ఎస్ఈసీగా రమేష్ కుమార్ ను కొనసాగించాలన్న హైకోర్టు తీర్పుపై స్టే ఇవ్వడానికి నిరాకరిస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను స్వాగతిస్తున్నాం. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం పై కోర్టులకు వెళ్ళాలిగాని, రాజ్యాంగాన్ని ధిక్కరిస్తాం అనుమతి ఇవ్వండి అని వెళితే ఇలాగే ఎదురుదెబ్బలు తగులుతాయి'' అని వైసిపి ప్రభుత్వాన్ని హెచ్చరించారు. 

''ఇప్పటికైనా "నా ఇష్టం-నా పాలన" అనే పెడధోరణి పక్కనపెట్టి వ్యవస్థలను కాపాడండి. ఎందుకంటే వ్యక్తుల కన్నా వ్యవస్థలే శాశ్వతం'' అంటూ ట్విట్టర్ ద్వారా ప్రభుత్వానికి, ముఖ్యమంత్రికి చంద్రబాబు హితవు పలికారు. 

read more   జగన్ కోసం, జగన్ చేత, జగన్ కొరకు... ఇది జగన్‌స్వామ్యం: యనమల ఎద్దేవా

 ఈ కేసులో ప్రతి విషయం తమకు తెలుసునని...కావాలనే స్టే ఇవ్వట్లేదని ప్రకటించింది కోర్టు. గవర్నర్ సలహాలివ్వాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. వచ్చే శుక్రవారంలోపుగా హైకోర్టు ఆదేశాలను అమలు చేయాలని సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చింది. 

జడ్జిలను, జడ్జిమెంట్లను ట్విట్టర్ వేదికగా విమర్శలు చేస్తున్నారని నిమ్మగడ్డ రమేష్ కుమార్ తరపు న్యాయవాది హరీష్ సాల్వే సుప్రీంకోర్టు  దృష్టికి తీసుకెళ్లారు. ఆ క్లిప్పింగ్ లను కూడ ఇవ్వాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. 

ఈ కేసులో కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేసేందుకు నిమ్మగడ్డ రమేష్ కుమార్ కు వారం రోజుల పాటు సుప్రీంకోర్టు గడువు ఇచ్చింది. హైకోర్టు తీర్పు అమలుకు గవర్నర్ జోక్యం చేయాల్సి వచ్చింది. ఇది కోర్ఠు ధిక్కరణగానే పరిగణించాల్సిందేనని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది.


 

click me!