టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటన నేపథ్యంలో విశాఖపట్నంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. టీడీపీ, వైసీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. కాగా, చంద్రాబు ర్యాలీకి పోలీసులు అనుమతి ఇవ్వలేదు.
విశాఖపట్నం: తెలుగుదేశం పార్టీ (టీడీపీ) అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి ఉత్తరాంధ్ర పర్యటన నేపథ్యంలో విశాఖపట్నం విమానాశ్రయం వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. గురువారం ఉదయం వైసీపీ, టీడీపీ కార్యకర్తలు విమానాశ్రయం వద్ద పోటాపోటీ నినాదాలు చేస్తున్నారు. విమానాశ్రయం వద్ద పోలీసులు భారీగా మోహరించారు.
చంద్రబాబును విమానాశ్రయం వద్దనే అడ్డుకోవాలనే ఉద్దేశంతో విమానాశ్రయానికి వెళ్లే దారిలో వైసీపీ కార్యకర్తలు బైఠాయించి నినాదాలు చేశారు. పోలీసులు వారిని అడ్డుకుని వెనక్కి పంపించారు. విమానాశ్రయానికి వెళ్లే దారిని పోలీసులు పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకున్నారు.
విమానాశ్రయానికి వెళ్లే రోడ్డుపై ఓ వైపు టీడీపీ కార్యకర్తలు, మరో వైపు వైసీపీ కార్యకర్తలు ప్లకార్డులు ప్రదర్శిస్తూ నినాదాలు చేస్తున్నారు. చంద్రబాబు గో బ్యాక్ అంటూ వైసీపీ కార్యకర్తలు నినాదాలు చేస్తుండగా, జై చంద్రబాబు అంటూ అనుకూలంగా టీడీపీ కార్యకర్తలు నినాదాలు చేస్తున్నారు. పోటాపోటీ నినాదాలతో తీవ్ర ఉత్కంఠ నెలకొంది.
చంద్రబాబు గురువారం విశాఖలో తలపెట్టిన ర్యాలీకి పోలీసులు అనుమతి ఇవ్వలేదు. విజయనగరం జిల్లాలో ప్రజా చైతన్య యాత్రకు వెళ్తూ చంద్రబాబు మధ్యలో పెందుర్తి మండలంలోని భూసమీకరణ బాధితులతో మాట్లాడాలని అనుకున్నారు. చంద్రబాబు ర్యాలీకి అనుమతి నిరాకరించడంపై టీడీపీ నాయకులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.