అమరావతిలోని మీ ఇల్లు ఇన్ సైడర్ ట్రేడింగ్ కాదా అని టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ప్రశ్నించారు, వైఎస్ ఏమైనా సొంత డబ్బులతో ఇల్లు కట్టుకున్నారా అని అడిగారు.
అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సొంతంగా సంపాదించి అమరావతిలో ఇల్లు కట్టారా, అమరావతిలో జగన్ ఇల్లు ఇన్ సైడర్ ట్రేడింగ్ ట్రేడింగ్ కాదా అని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రశ్నించారు రాజధానికి మిమ్మల్ని ఎవరు అప్పులు తెమ్మన్నారని, అమరావతిలో ఇప్పుడున్న షరతులు పాటించలేరా అని ఆయన జగన్ ను అడిగారు.
అమరావతిలో హైకోర్టు, పరిపాలనా భావనాలు లేవా అని అడిగారు. డబ్బు కోసం ఏమైనా చేస్తారా అని ప్రశ్నించారు. ఏ రాష్ట్ర రాజధానిలోనైనా ఎగ్జిక్యూటివ్, లెజిస్లేచర్ వేర్వేరు ప్రాంతాల్లో ఉన్నాయా అని ప్రశ్నించారు. పెట్టుబడిదారులు పారిపోయేలా చేశారని ఆయన జగన్ మీద మండిపడ్డారు.
అమరావతిలో కట్టడాలకు ఎక్కువ ఖర్చవుతుందని అబద్ధాలు చెబుతున్నారని ఆయన విమర్శించారు. హైదరాబాద్, చెన్నై కన్నా అమరావతిలో తక్కువ ఖర్చవుతుందని చెప్పారు. అమరావతిలో కట్టిన భవనాలు, రోడ్లు మీకు కనిపించలేదా అని అడిగారు. రైతులతో ప్రభుత్వం చేసుకున్న ఒప్పందాన్ని గౌరవించరా అని అడిగారు.
హైదరాబాదులో మైండ్ స్పేస్ కు వంద ఎకరాలు ఇస్తే లక్ష మందికి ఉద్యోగాలు వచ్చాయని ఆయన గుర్తు చేశారు. సిటీ అంటే అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్ ఒక్కటి మాత్రమే కాదని ఆయన అన్నారు. అమరావతిి చంపేసి పేద అరుపులు అరుస్తారా అని ఆయన ప్రశ్నించారు.
కొత్త నగరాలు సైబరాబాద్, నవీ ముంబై, డెహ్రాడూన్ అభివృద్ధి చెందలేదా అని చంద్రబాబు ప్రశ్నించారు. అమరావతిని తీసుకుని వెళ్లి ఫెయిల్యూర్ సిటీల్లో కలుపుతారా అని అడిగారు. బీసీజీ ఓ కన్సల్టెన్సీ కంపెనీ అని చెప్పుకోవడానికి సిగ్గుపడాలని ఆయన వ్యాఖ్యానించారు.
అమరావతి ప్రాంతంలోని రైతు మల్లికార్జున రావు గుండెపోటుతో మరణించడం బాధాకరమని చంద్రబాబు అన్నారు. భూములు ఇచ్చిన 29 వేల మంది రైతులు మనోవైదనతో ఉన్నారని ఆయన చెప్పారు. మహిళల పట్ల పోలీసులు అనాగరికంగా ప్రవర్తించారని ఆయన మండిపడ్డారు.
ప్రభుత్వం చేతగాని తనం వల్ల, నాటకాల వల్ల ప్రజలు బలవుతున్నారని ఆయన అన్నారు రాజధాని రైతులకు న్యాయం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని ఆయన అన్నారు.