మంత్రులతో చంద్రబాబు పొత్తు చర్చలు: కాంగ్రెస్ వైపు మొగ్గు?

By pratap reddyFirst Published Aug 21, 2018, 9:40 PM IST
Highlights

చర్చలో చంద్రబాబు కాంగ్రెసుకు అనుకూలమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. దాన్ని బట్టి చంద్రబాబు కాంగ్రెసుతో పొత్తు పెట్టుకునే విషయంపై యోచన చేస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. 

అమరావతి: తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కాంగ్రెసు వైపు మొగ్గు చూపుతున్న సూచనలు కనిపిస్తున్నాయి. తనకు అందుబాటులో ఉన్న మంత్రులు, పార్టీ ముఖ్య నేతలతో ఆయన మంగళవారం సమావేశమయ్యారు.ఈ సమావేశంలో వచ్చే ఎన్నికల్లో పొత్తులపై చర్చ జరిగింది. 

ఆ చర్చలో చంద్రబాబు కాంగ్రెసుకు అనుకూలమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. దాన్ని బట్టి చంద్రబాబు కాంగ్రెసుతో పొత్తు పెట్టుకునే విషయంపై యోచన చేస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. 

తెలుగు రాష్ట్రాల్లోని ప్రస్తుత పరిస్థితులపై, జాతీయ రాజకీయాలపై చంద్రబాబు మంత్రులు, ముఖ్య నేతలతో చర్చించారు. తెలంగాణలో ముందస్తు ఎన్నికల ఊహాగానాలపై కూడా సమావేశంలో చర్చ జరిగింది. తెలంగాణలో ముందస్తు ఎన్నికలు జరిగే అవకాశం ఉందని టీడీపి నేతలు చంద్రబాబుతో అన్నారు. 

వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీతో పొత్తు పెట్టుకోవాలనే అంశంపై తెలంగాణ టీడీపి నేతలతో చర్చించాలని ఆయన ముఖ్య నేతలకు సూచించారు. పార్టీకి ఉభయతారకంగా ఉండే విధంగా పొత్తులు ఉంటే బాగుంటుందని నేతలు, మంత్రులు అభిప్రాయపడినట్లు వార్తలు వస్తున్నాయి.

గతంతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెసుపై వ్యతిరేకత తగ్గిందని నాయకులు అభిప్రాయపడ్డారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామని కాంగ్రెసు ఇచ్చిన హామీని చంద్రబాబు సమావేశంలో గుర్తు చేశారు .

ఈ నేపథ్యంలో కాంగ్రెసుతో ఎలా వ్యవహరించాలనే అంశంపై చంద్రబాబు వారితో మాట్లాడారు. ప్రత్యేక హోదా ఇవ్వనని చెప్పిన బిజెపితో వైసిపి వెళ్తోందని, కాంగ్రెసు ప్రత్యేక హోదా ఇస్తామని అంటోందని చంద్రబాబు అన్నారు. 

చంద్రబాబుతో జరిగిన సమావేశంలో రాష్ట్ర మంత్రులు కళా వెంకట్రావు, నారా లోకేష్, అచ్చేన్నాయుడు, నక్కా ఆనంద బాబు, సుజయకృష్ణ రంగారావు, కాల్వ శ్రీనివాసులు పాల్గొన్నారు. 

click me!