ఒకటికి మూడుసార్లు చెప్పా... ఇక షాక్ ట్రీట్మెంటే: చంద్రబాబు

By Galam Venkata Rao  |  First Published Jul 16, 2024, 1:13 AM IST

ఆంధ్రప్రదేశ్‌లో అసాంఘిక కార్యకలాపాలు, గంజాయి వినియోగం, నేరాలపై కఠిన చర్యలు తీసుకుంటున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు. ఈ చర్యలకు పాల్పడే వారికి కఠిన శిక్షలు ఉంటాయని హెచ్చరించారు.


ఆంధ్రప్రదేశ్‌లో అసాంఘిక కార్యక్రమాలు ఎక్కడ జరిగినా ఊరుకునేది లేదని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. గంజాయి మత్తు, ఇష్టానుసారంగా నేరాలు, అత్యాచారాలు చేస్తే ఊరుకనేది లేదన్నారు. ఒకటికి మూడు సార్లు హెచ్చరించా... ఈసారి అఘాయిత్యాలు జరిగితే ఏం జరుగుతుందో కఠినంగా వ్యవహరించి చూపిస్తా అని హెచ్చరించారు. ముచ్చుమర్రి, విజయనగరంలో జరిగిన ఘటనలు సభ్య సమాజం తలదించుకునేలా ఉన్నాయన్నారు. ముచ్చుమర్రి బాధిత కుటుంబానికి రూ.10 లక్షలు, విజయనగరం చిన్నారి కుటుంబానికి రూ.5 లక్షలు ప్రభుత్వం నుంచి పరిహారం అందిస్తామని ప్రకటించారు. మైనర్లు కూడా అత్యాచారాలకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. చిన్నారులపై అత్యాచారలకు పాల్పడుతున్నారంటే వ్యవస్థ ఏ విధంగా భ్రష్టు పట్టిందో అర్థమవుతోందన్నారు. చర్యల్లేకనే ఉన్మాదులు మాదిరిగా తయారవయ్యారని.... ఈ దష్పరిణామాలకు గత ప్రభుత్వ అలసత్వమే కారణమని విమర్శించారు. ముచ్చుమర్రి, విజయనగరం ఘటనలపై స్పెషల్ కోర్టు ఏర్పాటు చేస్తామని సీఎం చంద్రబాబు నాయుడు ప్రకటించారు. అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడేవారికి ఇకపై షాక్ ట్రీట్మెంట్ ఉంటుందని హెచ్చరించారు. 

ఆంధ్రప్రదేశ్‌లో లా అండ్ ఆర్డర్ అమలు, గంజాయి, చీప్ లిక్కర్ అరికట్టే ఆంశాలపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన కీలక ఆదేశాలిచ్చారు. వెలగపూడిలోని సచివాలయంలో సమీక్ష అనంతరం ఈ వివరాలను రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత మీడియాకు వెల్లడించారు. నంద్యాల జిల్లా ముచ్చుమర్రి బాలిక ఘటనపై ఇప్పటికే ముగ్గురు మైనర్లు అరెస్ట్ అయ్యారని తెలిపారు. నిందితులు రోజుకో మాట మార్చడంతో బాలిక మృతదేహం ఆచూకీ కూడా ఇంకా లభించలేదని.. ఎన్.డి.ఆర్.ఎఫ్ బలగాలతో పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారని వెల్లడించారు. గంజాయి, మద్యం మత్తులో అత్యాచారాలు చేసే నిందితులు ఎటువంటి వారైనా వదిలే ప్రసక్తి లేదని హెచ్చరించారు. ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేసి నిందితులకు వెంటనే శిక్షలు కఠినంగా అమలు చేసేలా చర్యలు తీసుకోవాలని సీఎం చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారని హోం మంత్రి అనిత తెలిపారు.  

Latest Videos

విజయనగరం జిల్లా రామభద్రపురం మండలంలో ఆరు నెలల పసికందుపై వరసకు తాతైన వ్యక్తి అత్యాచార యత్నం చేయడంపై హోం మంత్రి ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాంటి వ్యక్తిని సంఘంలో చూడడం దురదృష్టకర పరిణామమన్నారు. ఈ సంఘటన గురించి తెలిసిన వెంటనే జిల్లా ఎస్పీతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నానని, మద్యం మత్తులో ఈ సంఘటన జరిగినట్లు తన దృష్టికి వచ్చిందన్నారు. గంజాయి, నకిలీ మద్యానికి బానిసలై వావివరసలు మరచిపోతున్నారని, పోర్న్ సైట్లు కూడా మైనర్లను చెడుదోవ పట్టిస్తున్నాయని అన్నారు. సెల్ ఫోన్లు పిల్లలకు ఇచ్చేముందు తల్లిదండ్రులు పిల్లలపై దృష్టి పెట్టాలని, పాఠశాలల్లో విద్యార్థులకు వాటిపై అవగాహన కల్పించాలని మంత్రి సూచించారు.

నేరం చేయాలంటే భయపడేలా చట్టాలు...

గంజాయి, నకిలీ మద్యానికి బానిసైన వారికి డి- ఎడిక్షన్ సెంటర్లు ఏర్పాటు చేయడంతో పాటు ఆడపిల్లలపై అత్యాచారం చేయాలనే ఆలోచన వచ్చిందంటే భయపడేలా శిక్షలు అమలు జరిపేందుకు చట్టాలు రూపొందిస్తామని హోం మంత్రి అనిత తెలిపారు. నంద్యాల జిల్లా ముచ్చుమర్రి అత్యాచార బాధితురాలి కుటుంబానికి పది లక్షల రూపాయల ఆర్థిక సహాయం, విజయనగరం జిల్లా అత్యాచార బాధిత పసికందుకు ఐదు లక్షల రూపాయలు ఫిక్సిడ్ డిపాజిట్ రూపంలో ముఖ్యమంత్రి మంజూరు చేశారని తెలిపారు. త్వరలోనే ఆ పరిహారాన్ని బాధిత కుటుంబాలకు స్వయంగా అందజేస్తానని హోం మంత్రి వివరించారు.

click me!